LKG 2020 Review: ఎల్‌కేజీ 2020 రివ్యూ - rj balaji lkg 2020 telugu movie review
close
Updated : 25/06/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LKG 2020 Review: ఎల్‌కేజీ 2020 రివ్యూ

చిత్రం: ఎల్‌కేజీ; నటీనటులు: ఆర్జే బాలాజీ, ప్రియా ఆనంద్‌, సంపత్‌, జె.కె.రితేశ్‌, రామ్‌ కుమార్‌ గణేశన్‌, అనంత్‌ వైద్యనాథన్‌ తదితరులు; సంగీతం: లియోన్‌ జేమ్స్‌; సినిమాటోగ్రఫ్రీ: విధు అయ్యన్న; ఎడిటింగ్‌: ఆంథోని; నిర్మాత: ఇషారి కె.గణేశ్‌; రచన: ఆర్జేబాలాజీ అండ్‌ ఫ్రెండ్స్‌; దర్శకత్వం: కె.ఆర్‌.ప్రభు; విడుదల: ఆహా

కరోనా సమయంలో ఓటీటీ వేదికగా అనేక కొత్త సినిమాలు, వివిధ భాషల్లో విజయవంతమైన చిత్రాలెన్నో అనువాదమై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ తగ్గినా, థియేటర్లు తెరవడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పలు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలు/వెబ్‌ సిరీస్‌లతో పాటు, ఇతర భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తున్నాయి. అలా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తమిళ సూపర్‌హిట్‌ ‘ఎల్‌.కె.జి’ని ‘ఎల్‌కేజీ 2020’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తమిళ అనువాద చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆర్జే బాలాజీ. మరి ఎల్‌.కె.జి. 2020 కథ ఏంటి? రాజకీయ నాయకుడిగా ఆర్జే బాలాజీ ఎలా నటించారు?

కథేంటంటే: లంకవరపు కుమార్‌ గాంధీ అలియాస్‌ ఎల్‌కేజీ(ఆర్జే బాలాజీ) ఒక ఊళ్లో వార్డు కౌన్సిలర్‌. ఆ వార్డులో వాళ్లకు ఏది కావాలన్నా చిటికెలో పని చేసి పెడతాడు. ఎవరైనా అధికారులు పనిచేయకపోతే, తన తెలివి తేటలతో వాళ్లను ఇబ్బందుల్లో పడేసి ఆ పని పూర్తయ్యేలా చేస్తాడు. దీంతో ఆ వార్డు జనాల్లో ఎల్‌కేజీ అంటే మంచి పేరు ఉంటుంది. అలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యం బారిన పడి కన్నుమూస్తాడు. దీంతో ఎల్‌కేజీ ఖాళీ అయిన ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అందుకు ఎల్‌కేజీ ఏం చేశాడు? ఉప ముఖ్యమంత్రి అయిన భోజప్ప(రామ్‌కుమార్‌ గణేశన్‌) మెప్పు ఎలా సంపాదించాడు? తన ప్రత్యర్థి అయిన రామచంద్ర(జె.కె.రితేశ్‌)ను ఎలా బోల్తా కొట్టించాడు? ఇందులో సరళ మునిస్వామి(ప్రియా ఆనంద్‌)పాత్ర ఏంటి? ఎల్‌కేజీ చివరకు ఎమ్మెల్యే అయ్యాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘మంచి రాజకీయ నాయకుడు కావాలంటే.. మంచివాడు కానవసరం లేదు. బాగా మాట్లాడితే చాలు జనాలు నమ్మేస్తారు. రాజకీయ నాయకులు కేవలం తమ మాటలతోనే దేశాన్ని పరిపాలిస్తున్నారు’ -ఇది ఎల్‌కేజీ మూవీలో ఉన్న ఒక డైలాగ్‌. సినిమా మొత్తం కథ ఈ ఒక్క డైలాగ్‌లోనే ఉంది. నేటి రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ అప్పుడప్పుడు పలు చిత్రాల్లో వచ్చే సెటైరికల్‌ డైలాగ్‌లు మనం చూస్తూనే ఉంటాం. పూర్తి పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీలు కూడా చాలా వచ్చాయి. అలాంటి కోవకు చెందిందే ‘ఎల్‌కేజీ’. ఒక వార్డు కౌన్సిలర్‌ అయిన సాధారణ యువకుడు ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగాడన్న రాజకీయ ప్రయాణాన్ని వ్యంగ్యంగా రాసుకోవడంలో ఆర్జే బాలాజీ, ఆయన స్నేహితులు సఫలమయ్యారు. దాన్ని అంతే అందంగా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు కె.ఆర్‌. ప్రభు.

ఒక పార్టీలో కేవలం ఉపన్యాసకుడిగా మిగిలిపోయిన తన తండ్రిని చూసి ఎల్‌కేజీ ఎలాగైన రాజకీయ నాయకుడు కావాలనుకోవడం, అందులో భాగంగానే వార్డు కౌన్సిలర్‌ అవడం తదితర సన్నివేశాలతో సినిమా ప్రారంభించాడు దర్శకుడు. అవన్నీ సరదాగా సాగిపోతాయి. ఎప్పుడైతే తాను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఎల్‌కేజీ అనుకున్నాడో అప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు రాజకీయ వ్యూహాలు/ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు రచించే కార్పొరేట్‌ సంస్థలు ఏవిధంగా పనిచేస్తాయి? ఎలాంటి ప్రచార వ్యూహాలు అమలు పరుస్తాయి? అన్న వాటిని చాలా చక్కగా చూపించారు. ఒక కార్పొరేట్‌ సంస్థ సాయంతో ప్రచారం ద్వారా దిల్లీ స్థాయిలో తన పేరు మార్మోగేలా ఎల్‌కేజీ చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. నేటి రాజకీయ నాయకులు ఎలాంటి వాటిని ఆసరాగా చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారో వాటన్నింటినీ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత అదే నియోజకవర్గంలో మంచి పేరున్న రాజకీయనాయకుడైన రామచంద్రం రాకతో కథ కీలక మలుపు తిరుగుతుంది. పార్టీని ఎదిరించి స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రం బరిలో దిగడంతో బలహీనుడైన ఎల్‌కేజీ ఎలా అతడిని ఢీకొంటాడన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కదులుతుంది.

ద్వితీయార్ధం మొత్తం ఎల్‌కేజీ-రామచంద్రల మధ్య జరిగే నాటకీయ పరిణామాలకు చక్కని హాస్యం జోడించి తీర్చిదిద్దిన విధానం నవ్వులు పూయిస్తుంది. ఎల్‌కేజీకి ఎదురయ్యే అనుభవాల నుంచే హాస్యం పుట్టించారు. ప్రచారంలో సోషల్‌ మీడియా, మీమ్స్‌, టెలివిజన్‌లో ప్రసారమయ్యే చర్చా వేదికలు ఇలా నేటి రాజకీయాల్లో ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశాన్ని దర్శక-రచయితలు చక్కగా ప్రస్తావించారు. ప్రతి విషయానికి హాస్యం జోడించటంతో ఆయా సన్నివేశాలన్నీ రక్తికట్టాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీలో చూసినట్లే అనిపించినా ఇందులోనూ వాటిని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఓటు విలువను తెలియజేస్తూ క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ, చివరిలో ఎల్‌కేజీ ఇచ్చే ట్విస్ట్‌తో నేటి రాజకీయ నాయకుడి ప్రవర్తన ఎలా ఉంటుందో సరదాగా చూపించారు.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాకు కథ అందించిన ఆర్జే బాలాజీనే ఇందులో కీలక పాత్ర పోషించారు. లంకవరపు కుమార్‌ గాంధీ అలియాస్‌ ఎల్‌కేజీ పాత్రలో ఒదిగిపోయాడు. తమిళ అనువాద చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రతి సన్నివేశంలోనూ తనదైన హాస్యం పంచారు. రాజకీయ వ్యూహలు రచించే కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగిగా ప్రియా ఆనంద్‌ కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. మిగిలిన వాళ్లెవరూ తెలుగువాళ్లకు తెలిసిన వాళ్లు కాదు. ఇదే కాస్త మైనస్‌. లియోన్‌ జేమ్స్‌ సంగీతం పర్వాలేదు. పాటలేవీ గుర్తుంచుకునే స్థాయిలో లేవు. చాలా పాటలు కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ, ఆంథోని ఎడిటింగ్‌ సమపాళ్లలో కుదిరింది. నిడివి 2గంటలే. హాస్యాన్ని ఆస్వాదిస్తూ సరదాగా సినిమా చూసేయొచ్చు. ఈ సినిమాకు ప్రధాన బలం రచన, దర్శకత్వం. నటుడు ఆర్జే బాలాజీ ఆయన స్నేహితులు నేటి రాజకీయ పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించి ప్రతి సన్నివేశాన్ని వ్యంగ్యంగా ప్రేక్షకుడిని అలరించేలా రాసుకున్నారు. అందుకు తగినట్లుగానే తెలుగులోనూ అనువాదం చేశారు. కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ‘అల వైకుంఠపురములో’ అలరించిన ‘సిత్తరాల సిరపడు’ పాట వచ్చే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ‘ఎల్‌కేజీ’ ఈ వీకెండ్‌లో మీకు మంచి వినోదాన్ని పంచుతుంది.

బలాలు బలహీనతలు
+ హాస్యం - తమిళ నేటివిటికీ దగ్గరగా ఉండటం
+ ఆర్జే బాలాజీ - తెలిసిన నటీనటులు లేకపోవడం
+ రచన, దర్శకత్వం  

చివరిగా: ‘ఎల్‌కేజీ’ హాస్యాన్ని పంచడంలో డబుల్‌ ‘పీజీ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని