నాన్న వైద్య ఖర్చులన్నీ చెల్లించాం: ఎస్పీ చరణ్‌ - sp charan press meet at chennai clarify about his father hospital bills issue
close
Updated : 28/09/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న వైద్య ఖర్చులన్నీ చెల్లించాం: ఎస్పీ చరణ్‌

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఆస్పత్రి బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్న ఆయన తాజాగా, ఎంజీఎం ఆస్పత్రి సిబ్బందితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తండ్రి మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తన తండ్రి చికిత్సకు అయిన మొత్తం బిల్లును చెల్లించినట్లు తెలిపారు. బిల్లు కట్టక తన తండ్రి భౌతికకాయం ఇవ్వలేదన్న ప్రచారం అవాస్తవమన్నారు.

‘‘నాన్న చనిపోయిన వార్తను మా కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. నాన్న లేని ఈ కష్టకాలంలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి వైద్యులు, సిబ్బంది ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నాన్న ఆరోగ్యం మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేశారు. ప్రతి పరీక్షకు, మందులకు అయిన ఖర్చును ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ, బిల్లులు ఇచ్చారు. వాటిలో కొంత మేము కట్టాం. మిగిలింది బీమా కంపెనీ చెల్లించింది. నాన్న చనిపోయిన రోజు ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు నాకు స్నేహితుడు. ‘వైద్యానికి ఎంత ఖర్చయింది. ఎప్పుడు చెల్లించమంటారు’ అని నేను అడిగాను. ‘ఇప్పుడు ఏమీ వద్దు. తర్వాత చూసుకుందాం’ అని అతడు చెప్పాడు. ఇదే విషయాన్ని ఆస్పత్రి అకౌంటెంట్‌ను కూడా అడిగాను. ‘ఆస్పత్రి బిల్లుల గురించి చరణ్‌ వద్ద ఏమీ మాట్లాడవద్దు. బాల సుబ్రహ్మణ్యంగారి భౌతికకాయాన్ని తరలించేందుకు అవసరమైన పనులను వేగంగా పూర్తి చేసి పంపండి’ అని ఎంజీఎం డైరెక్టర్‌ ఆయనతో అన్నారని అకౌంటెంట్‌ వివరించారు. ఆస్పత్రి బిల్లుల విషయంలో చాలా పారదర్శకంగా ఉన్నాం. తాము కట్టలేకపోయామని, ఈ విషయంలో ఆస్పత్రి వర్గాలు గట్టిగా పట్టుబట్టాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అస్సలు నమ్మొదు. వాటిలో ఏమాత్రం నిజం లేదు’’ అని ఎస్పీ చరణ్‌ విలేకరులతో అన్నారు.

ఎస్పీబీ వైద్య ఖర్చులకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయి. బిల్లు కట్టలేక తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడారని అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉపరాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్లారని పుకార్లు వచ్చాయి. అంతేకాదు, మొత్తం బిల్లు చెల్లించే వరకూ ఎస్పీ బాలు భౌతికకాయాన్ని ఇచ్చేది లేదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అన్నట్లు కొందరు రాసుకొచ్చారు. ఈ వార్తలన్నీ అర్థరహితమని, కొందరు ఇలాంటివి ఎందుకు ప్రచారం చేస్తారో అర్థంకావటం లేదని ఎస్పీ చరణ్‌ ఆదివారం రాత్రి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

ఎస్పీబీ కన్నుమూత: ఫేక్‌ వార్తలపై చరణ్‌ ఆగ్రహం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని