సంగీతంతో ఆ బాధ మాయమైంది - special story on gv prakash kumar
close
Updated : 13/06/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంగీతంతో ఆ బాధ మాయమైంది

చెన్నై: ఏఆర్‌ రెహమాన్‌ ఓ సంగీత మహావృక్షం. ఆ చెట్టు కొమ్మకు పూసిన మరో తీయని స్వరమే జీవీ ప్రకాశ్ కుమార్‌. రెహమాన్‌ మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినా.. సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక మార్గాలను సృష్టించుకొని సినీలోకాన్ని అబ్బురపరుస్తున్నాడు. ఓ వైపు నటుడిగా కొనసాగుతూనే ‘అసురన్’‌, ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాలకు సంగీతమందించి సినీ ప్రియులను అలరించిన ఈ యువ తరంగం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జీవీ ప్రకాశ్‌ గురించి కొన్ని విశేషాలు.

అయిదేళ్లకే సెలబ్రిటీ స్టేటస్‌

‘చికుబుకు చికుబుకు రైలే’ పాటకు ప్రభుదేవా వేసిన స్టెప్పులకు ఎంత పేరొచ్చిందో.. ఆ పాటలో వచ్చే పిల్లాడి స్వరం అంతగా ఆకట్టుకుంది. ఆ పాటను జీవీ ప్రకాశ్‌ అయిదేళ్ల వయసులోనే పాడి సెలబ్రిటీ అయిపోయాడు. ఆ తర్వాత ‘దొంగా.. దొంగా’ (దొంగ దొంగ), ‘కుచ్చి కుచ్చి కూనమ్మ ’(బొంబాయి) ఇలా మామయ్య రెహమాన్‌ కట్టిన బాణీలకు గొంతు సవరించి మంచి పాపులారిటీ సంపాదించాడు.


సంగీతం మాయ చేసింది

అమ్మ రెహానాకు సంగీతమంటే ఇష్టం. దీంతో నాలుగేళ్ల నుంచే శాస్త్రీయ సంగీతం క్లాసులకి పంపించేది. ఎంతగా సంగీతం నేర్చుకుంటున్నా, సినిమాల్లో పాడుతున్నా జీవీ ప్రకాశ్‌ మనసంతా క్రికెట్‌పైనే ఉండేది.  ఏడో తరగతిలో ఉండగా తల్లితండ్రులు వెంకటేశ్‌, రెహానాలు విడాకులు తీసుకోవడంతో జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సంగీతంపై మరింత శ్రద్ధతో సాధన చేశాడు. ఆ గాయాన్ని సంగీతంతో మరిచిపోయేవాడు. స్కూల్‌ నుంచి ఏ పోటీలకు వెళ్లినా ప్రైజ్‌ పక్కాగా తీసుకొచ్చేవాడు. అలా కీబోర్డు ప్లేయర్‌గా మంచి పేరు రావడంతో కొన్నాళ్లు విద్యాసాగర్‌, హరీశ్‌ జైరాజ్‌ల వద్ద పనిచేశారు. ‘అపరిచితుడు’లో ‘రెమో రెమో’తో గాయకుడిగా పరిచయమయ్యాడు. రెహమాన్‌ దగ్గర కొన్ని చిత్రాలకు పనిచేశాడు.


తొలిపాటకు పదకొండు బాణీలు

‘వేయిల్‌’ సినిమాకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి దర్శకుడు వసంత బాలన్‌, శంకర్‌ నిర్మాత. అయితే పది బాణీలిచ్చినా వసంత బాలన్‌కు సంతృప్తి కలగలేదు. దీంతో అవకాశం చేజారిపోతుందని ఆందోళనకు గురయ్యాడు. మొత్తానికి పదకొండో బాణీ వసంత బాలన్‌కు నచ్చడం, దానికి గీత రచయిత సహకారం అందించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అలా వేయిల్‌(వేసవి) సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. సినిమా సూపర్‌ హిట్‌. పాటలు కూడా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యాయి. 18 ఏళ్ల కుర్రాడు ఇంత మంచి బాణీలు ఎలా కట్టాడా? అని ఆశ్చర్యపోయింది కోలీవుడ్‌.


సంగీతం క్లాసిక్‌గా నిలిచింది

వేయిల్ పాటలు హిట్టు అవడంతో అవకాశాలు పెరిగాయి. ఆ మరుసటి ఏడాది ఆరు సినిమాలకు సంగీతం అందించాడు.  20 ఏళ్ల వయసులోనే సూపర్‌ స్టార్ రజినీ కాంత్‌ సినిమాకు పనిచేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత అంగడి తెరు(షాపింగ్‌ మాల్‌), మద్రాసపట్టినమ్(1947 ఓ ప్రేమ కథ) ‌, ఆడుకాలం, దైవ తిరుమగల్(నాన్న)‌, రాజారాణి, అయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు) ఇలా వరుస హిట్లతో మంచి పేరొచ్చింది. యుగానికి ఒక్కడు చిత్రానికి అందించిన సంగీతం బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు విపరీతంగా నచ్చేసింది. దాంతో బాలీవుడ్‌ క్లాసిక్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపుర్‌’కు పనిచేసే అవకాశమిచ్చాడు. సినిమాలాగే సంగీతం కూడా క్లాసిక్‌గా నిలిచింది. ‘అగ్లీ’ అనే మరో హిందీ చిత్రానికి పాటలందించాడు.


తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా

కరుణాకరణ్‌ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు జీవీ ప్రకాశ్‌. అది మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ‘ఎందుకంటే ప్రేమంటా!’, ‘ఒంగోలు గిత్త’, ‘రాజాధిరాజా’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలకు బాణీలందించాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టినా.. పాటలు మాత్రం హిట్‌ అయ్యాయి.


నటుడిగానూ సూపర్‌ హిట్‌

కుసేలన్‌(కథానాయకుడు), తలైవా (అన్న) సినిమాల్లోని పాటల్లో కనిపించిన ఈ సంగీత దర్శకుడు పూర్తి నటుడిగా మారింది 2015లో. ప్రేమ కథా చిత్రానికి తమిళ రీమేక్‌గా తీసిన ‘డార్లింగ్‌’ సినిమా అక్కడా విజయం సాధించింది. ఆ తర్వాత ‘త్రిష ఇల్లా నయనతార’, ‘పెన్సిల్’‌, ‘నాచియార్’‌, ‘సర్వం తాళమయం’, ‘100% కాదల్‌’.. ఇలా దాదాపు 20 సినిమాల్లో  నటించాడు. నిర్మాతగా మారి ‘మధ యానై కుట్టమ్‌’ సినిమాను నిర్మించాడు.  హీరోగా సినిమాల్లో చేస్తూనే ‘అసురన్’‌, ‘సురరై పోట్రు’( అకాశమే నీ హద్దు) లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు పాటలు అందించాడు. తలైవికి కూడా సంగీతమందించాడు.  ప్రస్తుతం హీరోగా పది చిత్రాలు చేతిలో ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని