రీల్‌లో రియల్‌ తండ్రీకొడుకులు - star appeared in sons movie
close
Updated : 10/05/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రీల్‌లో రియల్‌ తండ్రీకొడుకులు

అతిథి పాత్రల్లో మెరిపించి.. అభిమానులను మురిపించి

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు సినిమాను మూడు తరాలుగా విభజిస్తే.. మొదటి తరంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌.. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రానా.. ఇంకా చాలామందే ఉన్నారు. అయితే ఒకనాడు హీరోలుగా అలరించిన తారలు తమ వారసుల సినిమాల్లో తళుక్కుమని మెరుస్తున్నారు. వారసులు కూడా తమ తండ్రి సినిమాల్లో బాలనటులుగా మెరిసిన వాళ్లున్నారు. ఇలా.. రియల్‌ తండ్రీకొడుకులు రీల్లో కనిపించిన సినిమాలెన్నో ఉన్నాయి. అందులో కొన్ని చూస్తే..

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ప్రధానపాత్ర పోషిస్తున్నారు. కీలకపాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. చిరు-చరణ్‌ కలిసి ఒక సినిమాలో పూర్తి నిడివి పాత్రలు పోషించడం ఇదే తొలిసారి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ‘మగధీర’ చిత్రంలో మెగాస్టార్‌ ఓ పాటకు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

అక్కినేని కుటుంబం నుంచి ఒకే సినిమాలో ఏకంగా తాత, తండ్రి, మనవలు నటించి రికార్డు సృష్టించారు. 2014లో డైరెక్టర్‌ విక్రమ్‌కుమార్‌ తెరకెక్కించిన ‘మనం’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత నటించారు. ఈ చిత్రంలో అఖిల్‌ కూడా అతిథి పాత్రలో అప్పీరెన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. శ్రీరామదాసు చిత్రంలో ఏఎన్నార్‌ కబీర్‌దాస్‌గా కనిపించారు. ఈ సినిమాలో నాగార్జున భక్తరామదాసుగా ప్రధానపాత్ర పోషించారు. అఖిల్‌ సినిమా తెరంగేట్రం చేసిన చిత్రం ‘సిసింద్రీ’లో నాగార్జున కనిపించారు. ఆ తర్వాత ‘అఖిల్‌’ పేరుతో వచ్చిన చిత్రంలోనూ ‘అక్కినేని అక్కినేని’ పాటలో నాగార్జున తళుక్కున మెరిశారు.

1979లో ‘నీడ’ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన మహేశ్‌బాబు 1983లో తన తండ్రి కృష్ణతో కలిసి ‘పోరాటం’లో నటించారు. దాదాపు 9 చిత్రాల్లో మహేశ్‌ బాలనటుడిగా కనిపించారు. 1989లో వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేశ్‌బాబు ఏకంగా ద్విపాత్రాభినయంలో అదరగొట్టారు. ఆ తర్వాత పదేళ్లకు ‘రాజకుమారుడు’ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా.. తండ్రిగా కృష్ణ కనిపించారు.

‘బిల్లా’ సినిమాలో ప్రభాస్‌తో తన పెదనాన్న కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. 2008లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కాగా మరోసారి ప్రభాస్‌-కృష్ణంరాజు కలిసి తెరపై సందడి చేయబోతున్నారు. రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ విక్రమాధిత్యగా, కృష్ణంరాజు పరమహంస పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2021 జూలై 30న విడుదల కానుంది.

బాబాయ్‌ వెంకటేశ్‌.. అబ్బాయ్‌ రానా కలిసి నటించిన ఏకైక చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. ఈ సినిమాలో ఒక ఐటమ్‌సాంగ్‌లో సమీరారెడ్డితో కలిసి  వెంకటేశ్‌ స్టెప్పులేశారు. 2012లో వచ్చిన ఈ చిత్రానికి జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు.. అటు విష్ణు, ఇటు మనోజ్‌ చిత్రాల్లో పవర్‌ఫుల్‌ పాత్రలు చేస్తూ వస్తున్నారు. 2014లో వచ్చిన ఫ్యామిలీ స్టారర్‌ చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ కలిసి సందడి చేశారు. విష్ణుతో కలిసి మోహన్‌బాబు నటించిన సినిమాలు.. ‘లక్కున్నోడు’, ‘సలీమ్‌’, ‘గేమ్‌’, ‘సూర్యం’. మనోజ్‌తో కలిసి ఆయన నటించిన సినిమాలు.. ‘ఝుమ్మంది నాదం’, ‘శ్రీ’. 1985లో మోహన్‌బాబు, రాధిక జంటగా వచ్చిన ‘రగిలే గుండెలు’ చిత్రంలో విష్ణు బాలనటుడిగా కనిపించారు. 1993లో వచ్చిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమాలో మనోజ్‌ బాల నటుడిగా చేశారు. అందులో ఎన్టీఆర్‌తో కలిసి మోహన్‌బాబు నటించిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు హీరోగా వచ్చిన ‘పొలిటికల్‌ రౌడీ’లో విష్ణు, మనోజ్‌ ఇద్దరూ ప్రత్యేక అతిథి పాత్రల్లో నటించడం విశేషం.

1974లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘తాతమ్మ కల’ చిత్రంలో బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ బాలనటులుగా సందడి చేశారు. అదే ఏడాది ఇద్దరు సోదరులూ కలిసి ‘రామ్‌ రహీమ్‌’ ప్రధాన పాత్రదారులుగా నటించారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి తొమ్మిది చిత్రాల్లో నటించారు.

రవితేజతో కలిసి అతని కొడుకు మహాధన్‌ ‘రాజా ది గ్రేట్‌’లో చిన్ననాటి రవితేజగా కనిపించాడు.

Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని