నా తొలి చిత్రం విజయ్‌ దేవరకొండతో అనుకున్నా కానీ.. - telugu news director vivek athreya interview with tarun bhascker on etv actor sri vishnu also there
close
Updated : 26/07/2021 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా తొలి చిత్రం విజయ్‌ దేవరకొండతో అనుకున్నా కానీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మెంటల్‌ మదిలో’ కథతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు.. ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో కొత్త అనుభూతిని పంచాడు.. చేసింది రెండు సినిమాలే అయినా దర్శకుడిగా తనదైన మార్క్‌ చూపించాడు.. ఆయనే వివేక్‌ ఆత్రేయ. ఆ పేరు ఎవరు పెట్టారు? సినిమాల విషయంలో ఎదుర్కొన సవాళ్లు తదితర విషయాల్ని ‘నీకు మాత్రమే చెప్తా’ కార్యక్రమం వేదికగా పంచుకున్నారాయన. తరుణ్‌ భాస్కర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి మరో అతిథిగా నటుడు శ్రీ విష్ణు విచ్చేసి సందడి చేశారు. ఆ విశేషాలు మీకోసం..

తరుణ్‌: ఆత్రేయ అనే పేరు ఎవరు పెట్టారు?

వివేక్‌ ఆత్రేయ: అందరూ తమ పేర్లని మార్చుకుంటున్నారని మా అక్క ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు తన పేరు చివరన ఆత్రేయ అని పెట్టుకుంది. గోత్రాన్ని బట్టి ఆ పేరుని ఎంపిక చేసుకుంది. పెళ్లయ్యాక ఎలాగో తనకి గోత్రం మారుతుంది.. మనకైతే శాశ్వతం అనుకుని అదే పేరుని నేనూ పెట్టుకున్నా. 

తరుణ్‌:  ‘ఊసరవెల్లి’ సినిమాలోని ఓ పాట విని పేరు మార్చుకున్నావని తెలిసింది?

వివేక్‌ ఆత్రేయ: అది మీకెవరు చెప్పారు? అదొక కారణం అవ్వవచ్చు. (నవ్వులు) అసలు అదే కారణం కాదు.

తరుణ్‌: మీ తొలి సినిమాకి ‘యాక్షన్‌’ చెప్పకుండా మేనేజ్‌ చేశారట. ఆ సంగతేంటి?

వివేక్‌ ఆత్రేయ: నేనెప్పుడూ సినిమా సెట్స్‌ చూడలేదు. నా తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ సెట్‌నే తొలిసారి చూశాను. చిత్రీకరణకి సంబంధించిన ప్రోటోకాల్ గురించి నాకు అప్పటికి తెలీదు. అప్పుడు పూజ షాట్‌ తీస్తున్నాం. నిర్మాత రాజ్‌ కందుకూరి చెప్పమ్మా చెప్పమ్మా అంటున్నారు. సర్‌.. పెద్దవాళ్లు కదా మీరే చెప్పండి అన్నాను (నవ్వులు). సినిమా ప్రారంభ రోజుల్లో అలా మేనేజ్‌ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.

తరుణ్‌: తొలి చిత్రం విజయ్‌ దేవరకొండతో అనుకున్నారు కదా. ఎందుకు తనతో సినిమా చేయడం కుదర్లేదు?

వివేక్‌ ఆత్రేయ: ‘పెళ్లి చూపులు’ పూర్తయిన తర్వాత విజయ్‌కి ‘మెంటల్‌ మదిలో’ కథ చెప్పాను. తనకి నచ్చింది, చేద్దాం అన్నాడు. కానీ, పెళ్లి చూపులు తర్వాత వెంటనే అదే నేపథ్యంలో సాగే కథ కాకుండా మరొకటి అయితే బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే అప్పటికే ఇలాంటి జోనర్‌ కథల్ని మరికొన్ని విన్నాడు. సరే ప్రస్తుతానికి ఈ సినిమాని పూర్తి చేస్తా. భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దాం అని చెప్పాన్నేను.

తరుణ్‌: శ్రీవిష్ణు, వివేక్‌.. మీ పరిచయం గురించి చెప్తారా?

శ్రీ విష్ణు: కథ వినిపించడానికి హైదరాబాద్‌లోని ఓ స్పాట్‌కి రమ్మని వివేక్‌కి చెప్పాను. ఆ సమయంలో వివేక్‌ ఆత్రేయ అంటే నేనెవరో పెద్దాయన అనుకున్నా (నవ్వులు). వివేక్‌ చెప్పిన స్ర్కిప్టు 10 నిమిషాల్లోనే నాకు బాగా నచ్చేసింది. వెంటనే సినిమా చేద్దామని చెప్పా. నేను కొత్త వాళ్లతో ఎక్కువగా మాట్లాడను. అలాంటి నేను నెమ్మదిగా ఆయనకు కనెక్ట్‌ అయిపోయాను.

తరుణ్‌: వివేక్‌.. మీకు శ్రీ విష్ణులో నచ్చిన విషయం ఏంటి?

వివేక్‌ ఆత్రేయ: విష్ణు ఎనర్జీ లెవెల్స్‌, వైవిధ్య నటనని నేను ఇష్టపడతాను. నాకు అన్నయ్యలాంటి వాడు విష్ణు. ప్రతిరోజూ ఆయనతో మాట్లాడతా.

తరుణ్‌: సెట్‌లో వివేక్‌ ఎలా ఉంటాడు?

శ్రీ విష్ణు: వివేక్‌కి కోపం, చిరాకు వంటివి ఏమైనా వస్తాయా అంటే అది సెట్‌లోనే. ఏదైనా సన్నివేశం పూర్తయ్యాక కట్‌ చెప్పడు. ఎవరెంత బాగా నటించినా బాగుందనీ ప్రశంసించడు.

తరుణ్‌: విష్ణు.. మీరు మీ జీవితంలో ఇబ్బంది పడిన సంఘటన?

శ్రీ విష్ణు: నేనూ దర్శకుడు సాగర్‌ కె. చంద్ర ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథని పట్టుకుని నిర్మాతల దగ్గరికి వెళ్లేవాళ్లం. విన్నవాళ్లంతా ఎంత బడ్జెట్‌ అవుతుంది? అవి ఎలా తిరిగొస్తాయి అనే వాళ్లు. వ్యాపారాత్మకంగా కాకుండా మంచి సినిమాని నిర్మించే నిర్మాతగా ఎవరైనా కనిపిస్తారేమోనని దాదాపు మూడేళ్లు వెతికాం. అప్పుడనుభవించిన బాధ ఎప్పుడూ లేదు. చివరికి మేమే ఆ సినిమాని సొంతంగా నిర్మించాం. కెరీర్‌ ప్రారంభంలో సహాయ నటుడిగా చేశాను. ఎక్కువగా హీరో స్నేహితుడి పాత్రలు పోషించాను. ఆయా సినిమా చిత్రీకరణలో ఎక్కువగా బాధ కలిగేది. ఎవరూ మమ్మల్ని పేరుతో పిలిచేవారు కాదు. హీరో ఫ్రెండ్స్‌.. అనగానే మేం వెళ్లి నటించాలి. దర్శకుడు, కెమెరామెన్‌ మధ్య విభేదాల వల్ల మేం నలిగిపోయేవాళ్లం.

తరుణ్‌: వివేక్‌ నీ గురించి?

వివేక్‌ ఆత్రేయ: ‘మెంటల్‌ మదిలో’ స్క్రిప్టుతో ఓ నిర్మాత దగ్గరికి వెళ్లా. నిద్ర మత్తులో ఉన్న ఆయన కథ వినకుండానే ఇది వచ్చేసింది కదా. నువ్వు మరో కథ రాసుకోవడం మంచిది అన్నాడు. అలా కాదు సర్‌ మీరు స్క్రిప్టు మొత్తం వినలేదు కదా అంటే నేను 5 నిమిషాలు సీన్‌ పేపర్‌ చూసి ఆ కథ ఎండింగ్‌ ఏంటో నేను చెప్తాను అన్నాడు (నవ్వులు). ఆ ఫ్రస్టేషన్‌లోనే మరో కథగా ‘బ్రోచేవారెవరురా’ రాశాను. మరో నిర్మాతకి ఈ కథ చెప్పాలని వెళ్లా.. ఆయనేమో అమ్మాయిల్ని చూస్తూ కాలక్షేపం చేశాడు. అప్పుడు విపరీతమైన కోపం వచ్చి, ఆయనపై అరిచేశా.

తరుణ్‌: మీ సినిమాల్లో తండ్రి పాత్రలకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మీ నాన్నతో మీకున్న అనుబంధం గురించి..

వివేక్‌ ఆత్రేయ: నాన్నకి నేనేదో రాస్తుంటానని తెలుసు కానీ సినిమా తీస్తానని ఆయన ఊహించలేదు. అప్పుడప్పుడు కోపంలో నువ్వు డైరెక్టర్‌వి కదరా ఈ మాత్రం తెలియదా అని అంటుండేవారు. తిట్టింది వదిలేసి నేను దర్శకుడు అనే పదాన్ని పట్టుకునేవాణ్ని. పోనీలే ఈయన నన్ను దర్శకుడు అనుకుంటున్నాడు అనుకునేవాణ్ని. నేను తీసిన చిత్రాల్ని ఆయనకి చూపించలేకపోయా. నా సినిమా విడుదలైనప్పటికే ఆయన చనిపోవడం నన్ను కలచివేస్తుంటుంది.

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే వాళ్లకి శ్రీ విష్ణు ఇచ్చిన సలహాలు, వివేక్‌ ఆత్రేయ తన చిన్నప్పటి ఫొటోల గురించి చెప్పిన విశేషాలు ఈ కింది వీడియోలో చూడండి...


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని