Tollywood: తియ్యని తేనెల మూట.. మన తెలుగు పాట - tollywood songs about the importance of telugu language
close
Updated : 29/08/2021 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: తియ్యని తేనెల మూట.. మన తెలుగు పాట

పాలమీగడల కన్నా స్వచ్ఛమైనది.. పున్నమి వెన్నెల కన్నా అందమైనదని.. మన తెలుగు భాష అని ఎందరో ప్రముఖులు మన భాషను నెత్తిన పెట్టుకున్నారు. ఇంతటి మధురమైన భాషను తెలుగు సినీ కవులు తమ గేయాలతో మరింత కమనీయంగా మార్చారు. అలా తెలుగు భాషమీద వచ్చిన కొన్ని రమణీయమైన పాటలేంటో  చూద్దాం..

తెలుగంటే గోంగూర.. తెలుగంటే గోదారి

అలతి అలతి పదాలతో వినసొంపైన గీతాలను అందించిన గేయ రచయిత చంద్రబోస్‌. ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ కోసం తెలుగు జాతిపై రాసిన పాట మాతృభాష ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. మన తెలుగింటి పండగలు, వంటలు, పద్ధతులు, వ్యవహారశైలి ఇలా తెలుగుదనాన్ని రంగరిస్తూ చక్కని పాటని అందించారాయన. అంతే కాదు ఎంకీ పాటను, కూచిపూడి నాట్యాన్ని ఇలా తెలుగు జాతి ఆత్మను ఈ పాటలో ఆవిష్కరించారు చంద్రబోస్‌. 


మా తెలుగు తల్లి

రానా అరంగేట్ర చిత్రం ‘లీడర్‌’లో మా తెలుగు తల్లి పాటను వాడుకున్నారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు మిక్కీ జే మేయర్‌ బాణీ అందించారు. మా తెలుగుతల్లి గేయం ద్వారా సుపరిచితమైన గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి. ఆమె గాత్రంలోనే ఈ పాటంతా రమ్యంగా కొనసాగడం విశేషం. తెలుగు నేల గొప్పతనమంతా అద్భుతంగా వర్ణించారు గేయ రచయిత.  ‘లీడర్‌’  దర్శకుడు శేఖర్‌ కమ్ముల సినిమాకు తగినట్టుగా వాడుకున్నారు. తెలుగును అభిమానించే వారందరి నుంచి ప్రశంసలు పొందిందీ పాట. 


తెలుగు జాతి గొప్పదనం

తెలుగు భాషను మర్చిపోతే అమ్మానాన్నలను మరిచిపోయినట్టే అంటూ మాతృభాష ఆవశ్యకతను తెలియజెప్పిన ఈ పాటను చంద్రబోస్‌ రచించారు. పరభాష వ్యామోహంలో పడి మన భాషను మరవొద్దని హితబోధ చేసే ఆ సాహిత్యం మాతృభాష ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. పక్షులు తమ కూతను మార్చుకోనట్టే, ఈ భువిపైన ప్రాణులన్నీ తమ భాషను మరవలేవని గుర్తుచేస్తాడు రచయిత. తల్లిభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడొద్దని స్ఫూర్తి నింపుతారు చంద్రబోస్‌. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్‌ అంతే రమణీయంగా పాడారు. 


చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

‘గతమెంతో ఘనకీర్తి కలిగిన తెలుగోడా.. చెయ్యెత్తి జై కొట్టు’ అంటూ సాగే ‘పల్లెటూరు’ సినిమాలోని ఈ పాట  తెలుగు వాడి కీర్తిని, గొప్పదనాన్ని చాటిచెప్పింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు.  తెలుగోడి నెత్తురు మరిగించే సాహిత్యముందీ పాటలో.  మన భాష  గొప్పదనాన్ని చెబుతూనే, ‘పెనుగాలి వీచింది, అణగారిపోయింది’ అంటూ తెలుగుజాతి క్లిష్ణపరిస్థితులను గుర్తుచేస్తారు. చుక్కాని పట్టి తెలుగు నావని దరి చేర్చమని దిశానిర్దేశం కూడా చేసే పాటిది. ఇంత అద్భుతమైన పాటకు వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్యమందించగా, ఘంటసాల అదిరిపోయే బాణీ కట్టారు. ఇదే పాటని బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌లోనూ వాడుకున్నారు. అప్పుడూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. 


నిండుగా వెలుగు జాతి మనది

యాసలు వేరైనా మన భాషంతా తెలుగేనని చాటి చెప్పేలా సాగే ఈ పాటను సినారె రచించారు. ఎన్టీఆర్‌ నటించిన ‘తల్లా పెళ్లామా’చిత్రంలోనిదీ గేయం. ఘంటసాల సంగీతంతో పాటు, గాత్రం కూడా అందించారు. స్వాతంత్ర్య సమరంలో కలిసి కట్టుగా తెలుగు జాతి చేసిన పోరును గుర్తుచేస్తుందీ పాట. అలాగే కలహాలు వీడి తెలుగు జాతంతా కలిసికట్టుగా ముందుకు సాగాలనే హితబోధ చేస్తుందీ పాట. తెలుగు నేల ప్రశస్తిని చాటిచెప్పిన పాటల్లో ‘తెలుగు జాతి మనది’ కచ్చితంగా ముందు వరసలో ఉండే గీతం.

దినదినమూ వర్ధిల్లే భాష

‘తేనెకన్న తియ్యనది, దేశభాషలందు లెస్స తెలుగు భాష’ అంటూ సాగే ఈ గీతం శోభన్‌బాబు నటించిన రాజ్‌కుమార్‌ చిత్రంలోనిది. ‘మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును, పావురాల కువకువలు పలుకులందు నినదించును’ అంటూ తెలుగు భాష శక్తిని చెబుతుందీ పాట. ఈ పాటకు ఇళయరాజా అందించిన సంగీతం తెలుగు భాషంత కమనీయంగా ఉంటుంది.


తెలుగు భాష గొప్పదనం గురించి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ పంచుకున్న అద్భుత మాటలుAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని