close
సినిమా రివ్యూ
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రివ్యూ: అంధకారం

చిత్రం: అంధకారం

నటీనటులు: అర్జున్‌ దాస్‌, వినోద్‌ కిషన్‌, పూజా రామచంద్రన్‌, జీవా రవి, కుమార్‌ నటరాజన్‌ తదితరులు

సంగీతం: ప్రదీప్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: ఏఎం ఎడ్విన్‌ సఖ్య

ఎడిటింగ్‌: సత్యరాజ్‌ నటరాజన్‌

నిర్మాత: ప్రియా అట్లీ, సుధాన్‌ సుందరం, జయరాం, పూర్ణ చంద్ర

రచన, దర్శకత్వం: వి.విఘ్నరాజన్‌

విడుదల: నెట్‌ఫ్లిక్స్‌ (24-11-2020)

ఏ చిత్ర పరిశ్రమలోనైనా విజయవంతమైన జోనర్‌ అంటే కామెడీ - హారర్‌ థ్రిల్లర్‌. కామెడీ చిత్రాలను పక్కన పెడితే, ‘భయానికి భాష అక్కర్లేదు’ అన్నట్లు బిగిసడలని ఉత్కంఠ, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కలిగించే థ్రిల్లర్‌ కథాంశాలు అందరినీ అలరిస్తాయి. అందుకే ఆ ఫార్ములా చిత్రాలకు సక్సెస్‌ రేటు ఎక్కువ. అలాంటి జోనర్‌లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అంధకారం’. కరోనా కారణంగా థియేటర్లు ఇంకా తెరుకోని నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ‌వేదికగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరించింది? కథా నేపథ్యం ఏంటి? చూద్దాం!

కథేంటంటే: చెన్నైలో కొంతమంది వ్యక్తుల ఇంటి ల్యాండ్‌లైన్‌కు ఒకేసారి ఫోన్‌ కాల్స్‌ వస్తాయి. ఆ తర్వాత వారంతా ఆత్మహత్య చేసుకుంటారు. కట్‌ చేస్తే, వినోద్ ‌(అర్జున్‌ దాస్‌) క్రికెట్‌ కోచ్‌. పిల్లలకు క్రికెట్‌ పాఠాలు చెబుతుంటాడు. అయితే, అతని గదిలో ఎవరో ఉన్నారని, తనని వెంటాడుతున్నారని భయపడుతుంటాడు. మరోవైపు సూర్యం (వినోద్‌ కిషన్‌) అంధుడు. ప్రభుత్వ గ్రంథాలయంలో క్లర్క్‌గా పనిచేస్తుంటాడు. తండ్రి నుంచి కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుని ఉంటాడు. డాక్టర్‌ ఇంద్రాన్‌ (కుమార్‌ నటరాజన్‌) సైక్రియాటిస్ట్‌. ఒక వ్యక్తికి చికిత్స చేస్తుండగా అతడు కాల్పులు జరపడంతో స్వరపేటిక కోల్పోయి కోమాలోకి వెళ్లిపోతాడు. ఎనిమిది నెలల తర్వాత కోమా నుంచి కోలుకుంటాడు. పూజ (పూజా రామచంద్రన్‌) టీచర్‌. అంధులకు పాఠాలు చెబుతుంటుంది. ఈ నలుగురి మధ్య ఏం జరిగింది? దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? వినోద్‌ గదిలో నిజంగానే దెయ్యం ఉందా?తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘అంధకారం’ పేరు వినగానే ఇదొక సస్పెన్స్‌తో కూడిన దెయ్యం కథ అని ప్రేక్షకుడు ఊహిస్తాడు. అయితే, నిజంగా కథలో దెయ్యం ఉందా? లేదా? అనే చిన్న ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ను తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకున్నాడు దర్శకుడు. కొంతమంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంతో కథ ప్రారంభించాడు దర్శకుడు. దీంతో ఈ హత్యల వెనుక ఉన్నదెవరు? అనే ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత వినోద్‌, సూర్యం, ఇంద్రాన్‌, పూజ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పరిచయ సన్నివేశాలకు ఎక్కువ సమయం తీసుకోవడంతో... అసలు కథ ఎప్పుడు మొదలవుతుందా? అన్న అసహనం ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఒకవైపు అదృశ్య వ్యక్తి వినోద్‌కు ఫోన్‌ చేసి బెదిరించడం, మరోవైపు అంధుడైన సూర్యం తన డయాలసిస్‌ కోసం దెయ్యాన్ని పట్టుకుంటానంటూ ఒక వ్యక్తిని కలవడం, మరోవైపు కోమా నుంచి కోలుకున్న డాక్టర్‌ ఇంద్రాన్‌ అధికారులకు తెలియకుండా తన పాత పేషెంట్‌కు చికిత్స చేయడంతో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. విరామ సమయానికి కూడా కథపై ప్రేక్షకుడికి గ్రిప్‌ దొరకదు. దెయ్యం ఉందా? లేదా ఎవరైనా కావాలనే ఇలా చేస్తున్నారా? అనే అంశంతో దర్శకుడు కథను సాగదీసే ప్రయత్నం చేశాడు.

ద్వితీయార్ధం కథా గమనంలో కాస్త వేగం పెరిగినా అసలు కథ తెలియడానికి చివరి సన్నివేశం వరకూ వేచి చూడాల్సిందే. పైగా సినిమా దాదాపు మూడు గంటలు ఉండటం ఓటీటీ ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సినిమా చూసేటప్పుడు ఎక్కడైనా ఒకట్రెండు సన్నివేశాలు మిస్‌ అయితే, అర్థం కావడటానికి కొంత సమయం పడుతుంది. చివరకు అసలు విషయం తెలిశాక, అది చెప్పడానికి ఇంత నిడివి అక్కర్లేదేమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన ఓ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ఛాయలు కనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే: ‘అంధకారం’లో పూజా రామచంద్రన్‌ మినహా మిగిలిన నటీనటులు ఎవరూ తెలిసిన వాళ్లు కాదు. అయితే, అందరూ ఆయా పాత్రలకు చక్కగా సరిపోయారు. అర్జున్‌ దాస్‌, వినోద్‌ కిషన్‌, కుమార్‌ నటరాజన్‌, పూజ తమ పాత్రాల్లో ఒదిగిపోయారు. మరీ ముఖ్యంగా భయపడే యువకుడిగా అర్జున్‌, అంధుడిగా వినోద్‌ కిషన్ నటన మెప్పిస్తుంది. ఇక సినిమాకు ప్రధాన బలం సాంకేతిక బృందం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశానికి ప్రదీప్‌ కుమార్‌ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుణ్ని లీనం చేసేందుకు ప్రయత్నించాడు. పాటలు కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం ఏఎం ఎడ్విన్‌ సఖ్య సినిమాటోగ్రఫీ. చిన్న చిన్న ఎలిమెంట్స్‌ను కూడా చక్కగా చూపించాడు. లైటింగ్‌ ఎఫెక్ట్‌ బాగుంది. వినోద్‌ తన గదిలో ఓ పుస్తకంలోని పేజీలను అంటించిన సన్నివేశం వావ్‌ అనిపిస్తుంది. ప్రతి పేజీకి సరైన గ్యాప్‌ మెయింటేన్‌ చేస్తూ తీర్చిదిద్దిన విధానం భలే అనిపిస్తుంది. దాంతోపాటు డైస్‌ ఉన్న కీచైన్‌ ఎగరడం, బీర్‌ బాటిల్‌ దొర్లుకుంటూ వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

తెలుగులో రెండు మూడు చోట్ల సంభాషణలు బాగున్నాయి. ‘ఓటమి సామాన్యమైన విషయం... ధైర్యంగా ఎదుర్కోవాలి’, ‘మనం తప్పు చేస్తే, అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎటువైపు వెళ్లినా సరే’ వంటి సంభాషణలు మెరిశాయి. సత్యరాజన్‌ నటరాజన్‌ తన ఎడిటింగ్‌ అసలు పని చెప్పలేదేమో అనిపిస్తుంది. ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు మూడు గంటల నిడివి చాలా ఎక్కువ. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా ఎందుకు వేయలేదో తెలియదు. నిడివి ఏమాత్రం తగ్గించినా సినిమా మరోలా ఉండేది. దర్శకుడు వి.విఘ్నరాజన్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదే అయినా, అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. ఆ పాయింట్‌ పట్టుకుని సినిమాను అంత సాగదీయాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఓటీటీలో సినిమా చూసే ప్రేక్షకుడిని మూడు గంటల పాటు కూర్చోబెట్టడం సాధ్యం కాని పని.

బలాలు బలహీనతలు
+ నటీనటులు - నెమ్మదిగా సాగే కథనం
+ సాంకేతిక బృందం పనితీరు - నిడివి
+ క్లైమాక్స్‌ ట్విస్ట్‌  

చివరిగా: ‘అంధకారం’లో ప్రయాణం నెమ్మదిగా ఉన్నా, ఇదొక థ్రిల్లింగ్‌ జర్నీ.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు