close

తాజా వార్తలు

Published : 01/11/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దొంగ పోలీస్‌ దందా!

విజయవాడ : ఒకరు ఆర్‌ఎస్సై కుమారుడు.. మరొకరు దుర్గగుడి పాలకమండలిలో కీలక పదవిలో ఉన్న వ్యక్తికి సమీప బంధువు.. ఇద్దరూ కలిసి డబ్బుకోసం అడ్డదారి తొక్కారు. ఓ విద్యార్థిని బెదిరించి ఒకరు గంజాయి తెప్పించుకోగా.. మరొకరు తాను పోలీస్ నంటూ వచ్చి పట్టుకున్నారు. ఆ తర్వాత కేసుల పేరిట డబ్బు దండుకున్నారు. ఈ దందాలో పట్టుబడింది పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో.. పోలీసులు గప్‌చుప్ అయ్యారు. విజయవాడలో ఓ కిడ్నాప్‌ కేసులో తీగ లాగితే ఈ దొంగపోలీస్‌ దందా డొంకంతా కదిలింది. 

వివరాల్లోకి వెళితే...మొగలి రాజాపురానికి చెందిన విద్యార్థికి గంజాయి తాగే అలవాటు ఉంది. దీంతో సింగ్‌నగర్‌లో పూలమ్మే ఓ అమ్మాయి వద్ద కొనుగోలు చేశాడు. ఎవరూ చూడలేదులే అనుకున్న అతడికి ఓ వ్యక్తి ఫోన్‌చేశాడు. తనకూ గంజాయి తెచ్చివ్వమని, లేదంటే పోలీసులకు చెప్తానని బెదిరించాడు. దాంతో భయపడిన అతను.. రూ.వెయ్యి విలువ చేసే గంజాయి కొని మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కనక దుర్గమ్మ వారధి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి.. లతీఫ్‌ అనే ఓ వ్యక్తి వచ్చాడు. గంజాయి తెచ్చావా అని అతడిని అడిగాడు. లతీఫ్‌కు, అతడు గంజాయి ఇస్తుండగా..అక్కడికి ఓ బుల్లెట్‌ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము పోలీసులమన్నారు. ఈ లోగా గంజాయి పాకెట్‌తో లతీఫ్‌ అక్కడి నుంచి పారిపోయాడు.  బుల్లెట్‌పై వచ్చిన ఇద్దరు ఆ విద్యార్థిని ఓ చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లారు. రూ. మూడు లక్షలు ఇస్తే కేసులు లేకుండా వదిలేస్తామని బేరం పెట్టారు. తన వద్ద రూ. రెండు వేలు ఉన్నాయని, తనను వదిలేయండని అతడు వారితో మొరపెట్టుకున్నాడు. ఆ వ్యక్తులు ఆ డబ్బును లాగేసుకున్నారు. రూ. యభైవేలు తీసుకురావాలంటూ అతడిపై దాడి చేసి వదిలేశారు. 

ఈ ఘటన గురించి అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి ఓ క్లూ కూడా ఇచ్చాడు. గంజాయి పాకెట్‌తో పారిపోయిన లతీఫ్‌తో పాటు మరో ఇద్దరు.. తనను బంధించిన చోటుకు రావటంతో అతడికి విషయం మొత్తం అర్థమైంది. తనపై దాడి చేసినవారిలో ప్రదీప్‌ అనే ఓ వ్యక్తి ఉన్నాడని, అతడితో తనకు పాత గొడవలు ఉన్నాయని వివరించాడు. ఈ కేసులో లతీఫ్‌, ప్రదీప్‌, భానుప్రకాశ్‌, వినయ్‌ రాజన్‌, పవన్‌ కుమార్‌లను  పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రముఖులకు సంబంధీకులు. అందువల్ల పోలీసులు గప్‌చుప్‌గా ఉన్నారు. నిందితుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించారు. పై అధికారుల ఆంక్షలు ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చేందుకు ముఖం చాటేస్తున్నారు.



 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.