చీటింగ్‌ కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 08/11/2020 02:04 IST

చీటింగ్‌ కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్ట్‌

తిరువనంతపురం: కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఎమ్మెల్యే ఎంసీ కమరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై చీటింగ్‌ కేసులు నమోదవ్వడంతో శనివారం కేరళలోని కాసరగఢ్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. అరెస్టు అనంతరం ఆయన్ను సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ఫ్యాషన్‌ గోల్డ్‌ జ్యువెలరీ గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్న కమరుద్దీన్‌ కోట్లాది రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను చెల్లించినప్పటికీ తిరిగి వారికి డబ్బులు ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని ఆరోపిస్తూ ఆయనపై కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. 

ఇన్వెస్టర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఫ్యాషన్‌ గోల్డ్‌ జ్యువెలరీ అవుట్‌లెట్లను గతేడాది డిసెంబర్‌లో అకస్మాత్తుగా మూసివేశారు. అయితే, ఆగస్టు నుంచి ఆయనపై దాదాపు 100కు పైగా కేసులు నమోదైనట్టు సమాచారం. ప్రారంభంలో వచ్చిన ఫిర్యాదులను బట్టి రూ.కోటి మోసం జరిగినట్టు చూపించగా.. ఇంకా చాలా మంది ముందుకు రాలేదని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇది మొత్తం రూ.100 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన కమరుద్దీన్‌.. దీన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా తెలిపారు. ఐయూఎంఎల్‌.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో భాగస్వామి పార్టీగా  ఉన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని