జాతీయ రహదారిపై నోట్ల కట్టలు కలకలం..!

తాజా వార్తలు

Published : 28/08/2020 01:00 IST

జాతీయ రహదారిపై నోట్ల కట్టలు కలకలం..!

ఓ రైతు సరదాగా చెప్పిన మాటకు జోరుగా ప్రచారం
వివరాలు వెల్లడించి రాయదుర్గం ఎస్సై

రాయదుర్గం: అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై నోట్ల కట్టలు పడి ఉన్నాయనే సమాచారం కలకలం రేపింది. రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రూ.10లక్షల విలువ చేసే రూ.500నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండగా కొందరు వాటిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. బొమ్మక్కపల్లి, 74ఉడేగోళం గ్రామాలకు చెందిన కొందరు నోట్ల కట్టలు తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే నగదు ఏరుకున్న వ్యక్తులు నోట్ల కట్టలు తమవేనంటూ తీసుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. రహదారిపై భారీగా నగదు దొరికిందనే ప్రచారంతో సమీప గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. దీనిపై అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన వివరాలను రాయదుర్గం ఎస్సై రాఘవేంద్రప్ప మీడియాకు వెల్లడించారు.  

 

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నోట్ల కట్టలు బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఓబులేసు అనే రైతుకు చెందినవిగా గుర్తించారు. ఓబులేసుకు రాయదుర్గం సిండికేట్‌ బ్యాంకులో క్రాప్‌లోన్‌ కింద రూ.1.94లక్షల మంజూరైంది. ఖాతాలో రూ.2వేలు నగదును అలానే ఉంచి,  మిగిలిన రూ 1.92లక్షల నగదు బ్యాంకు నుంచి డ్రా చేసి టవల్‌లో పెట్టుకుని బయల్దేరాడు. మార్గంమధ్యలో రోడ్డుపై టవల్‌ పడిపోయింది. అనంతరం సదరు రైతు ఆ డబ్బును తన లుంగీలో కట్టుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు ఓబులేసును ప్రశ్నించగా రూ.500 రూపాయల నోట్ల కట్టలు రూ.4-5 లక్షల దాకా దొరికాయని సరదాగా చెప్పాడు. అయితే ఆ రైతు చెప్పిన మాటలను స్థానికులు నిజమని నమ్మడంతో నోట్ల కట్టలు దొరికాయనే ప్రచారం జోరుగా జరిగింది. అంతే తప్ప జాతీయ రహదారిపై డబ్బు దొరికిందనేది తప్పుడు ప్రచారమని.. ఆ రైతు బ్యాంకు నుంచి తెచ్చుకున్న నగదు పొరపాటున కిందపడటంతో దానిపై ఈ విధంగా ప్రచారం జరిగిందని ఎస్సై స్పష్టం చేశారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని