
తాజా వార్తలు
ఆలయాల్లో దాడులపై రాజకీయ ప్రమేయం:డీజీపీ
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి పలు రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్లు గర్తించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళగిరిలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఘటన తర్వాత పార్టీల దుష్ప్రచారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆలయాలకు సంబంధించి ఇప్పటివరకు 44 ఘటనల్లో 29 కేసులు ఛేదించి, 81 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 9 కేసుల్లో 21 మంది రాజకీయ పార్టీల కార్యకర్తలకు ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు.
రాష్ట్రంలోని ఆలయాలపై దాడుల వెనక కుట్ర కోణం దాగి ఉందా అనే విషయమై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. దాడులకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దుష్ప్రచారాలు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడంలో రాజకీయ పార్టీల కుట్ర ఉన్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం, అంతర్వేది ఘటనల్లోనూ దుష్ప్రచారం జోరుగా జరిగిందన్నారు. ఇలా ప్రచారం చేస్తూ కొన్ని చోట్ల అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టి, వదంతులు వ్యాప్తి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు.
ఇవీ చదవండి..
అఖిలప్రియ కేసులో దర్యాప్తు ముమ్మరం
ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం