కరోనాను జయించాడు.. కానీ ఆ భయమే చంపేసింది!

తాజా వార్తలు

Published : 01/06/2021 01:42 IST

కరోనాను జయించాడు.. కానీ ఆ భయమే చంపేసింది!

అహ్మదాబాద్‌: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండటం ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. కొన్నిచోట్ల నమోదవుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కలవరపెడుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘80 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి అహ్మదాబాద్‌లోని పాల్దీ ప్రాంతంలోని అమన్‌ అపార్టుమెంట్‌లో  నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం తన అపార్ట్‌మెంట్‌లోని టెర్రాస్‌పైకి వెళ్లి పురుగుల మందు తాగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలం క్రితం ఆ వృద్ధుడు కరోనా బారినపడి కోలుకున్నాడు. ఇటీవల నోటిలో పుండులా ఏర్పడటంతో బ్లాక్‌ఫంగస్‌ సోకిందేమోననే భయాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ సూసైడ్‌ నోటు రాసి పెట్టి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకినవారికి, అందులోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులకు బ్లాక్‌ఫంగస్‌ ముప్పు పొంచి ఉండటంతో తనకూ ఈ వ్యాధి వచ్చిందేమోనన్న భయంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్సతో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని ఆ వృద్ధుడు భావించాడు. ఆ బాధను దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు.. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌, అతడి సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేశాం. బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం’’ అని పాల్దీ ఇన్‌స్పెక్టర్‌ జేఎం షోలంకి తెలిపారు.

కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని, అనవసర భయాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని