కారులో మృతదేహాలు.. అసలేం జరిగింది?

తాజా వార్తలు

Updated : 17/02/2020 14:45 IST

కారులో మృతదేహాలు.. అసలేం జరిగింది?

కరీంనగర్‌: కరీంనగర్‌ శివారులోని అల్గునూరు వద్ద కాకతీయ కాల్వలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం రాత్రి ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి కాల్వలో పడిపోవడంతో గాలింపు చేపట్టిన క్రమంలో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబం కాల్వలో శవాలుగా తేలారు. నరెడ్డి సత్యనారాయణ రెడ్డి (55), ఆయన భార్య రాధ (50), కుమార్తె వినయశ్రీ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆదివారం రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన దంపతులు కాకతీయ కాలువలో పడిన క్రమంలో వారిని గుర్తించేందుకు ఎస్సారెస్పీ కాల్వలో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాకతీయ కాలువకు సుమారు కిలో మీటర్ దూరంలో అకస్మాత్తుగా బోల్తా పడి ఉన్న ఓ కారు కనిపించింది. సమాచారం అందుకున్న లోయర్ మానేర్‌ డ్యాం ఎస్సై నరేశ్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కారును బయటికి తీసి మూడు మృత దేహాలను వెలికి తీశారు.  కారు నంబర్‌ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబంగా నిర్థారణకు వచ్చారు.

ఎమ్మెల్యే చిన్న సోదరి రాధ కుటుంబం ప్రస్తుతం కరీంనగర్‌లో నివాసముంటోంది. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. భర్త సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని ఓ దంత వైద్య కళాశాలలో బీడీఎస్‌ చదువుతోంది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఎలా జరిగిందో ఇంకా తెలియదు: సీపీ

ఘటనా స్థలాన్ని కరీంనగర్‌ నగర పోలీస్‌ కమిషన్‌ కమలాసన్‌రెడ్డి సందర్శించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఉదయం కెనాల్‌లో కారు కనబడింది. క్రేన్‌ తెప్పించి కారును బయటకు తీసుకొచ్చాం. మూడు మృతదేహాలు ఉన్నాయి. ఆ కారు నంబర్‌ ఆధారంగా విచారణ చేశాం. ఆ కారు సత్యనారాయణ రెడ్డి పేరుపై ఉన్నట్టు తెలిసింది. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యేకు స్వయాన సోదరి.. బావ.. మేనకోడలు. కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఎలా జరిగిందో ఇంతవరకు వివరాల్లేవు. ట్రైనీ ఐపీఎస్‌ నిఖితా పంత్‌ దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గుర్తించాం. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని తెలిపారు.

గత నెల 27న ఇంటినుంచి బయల్దేరి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘోరం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. నీటిలో మృతదేహాలతో పాటు వాళ్ల బ్యాగ్‌ ఒకటి దొరికింది.. మెడలో ఆభరణాలు ఉన్నాయన్నారు. ఒక సెల్‌ఫోన్‌ దొరికినట్టు పోలీసులు చెప్పారు.

సోదరి కుటుంబం మృతిపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
తన సోదరి కుటుంబం మృతిపై ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబంలో ఎలాంటి కలహాలూ లేవని స్పష్టంచేశారు. గత నెల 27న ఇంటినుంచి బయల్దేరి వెళ్లారని తెలిపారు. తీర్థయాత్రలకు వెళ్తుంటారనీ.. ఇరుకైన వంతెన, రెయిలింగ్‌ కూడా సరిగా లేకపోవడంతో ప్రమాదవశాత్తు ఈ విషాదం జరిగిందని నమ్ముతున్నామన్నారు. తన సోదరి కుటుంబం మృతిపై అనుమానాలు లేవన్నారు. గత నెల 27న సాయంత్రం ఊరికు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారనీ.. ఈ క్రమంలో అనుకోని సంఘటన జరిగిందని ఆయన ఆవేదన చేశారు. ఇన్ని రోజులుగా కనిపించకపోవడంతో వారి బంధువుల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నం చేసినట్టు చెప్పారు. ఏడాదికోసారి ఏదైనా టూర్‌కు వెళ్తుంటారనీ.. అలా ఏమైనా వెళ్లారేమో అనుకొని ఎదురుచూశామని తెలిపారు. కానీ ఇలా కారులో శవాలుగా బయటపడటం బాధాకరమన్నారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవనీ.. ఎంతో సంతోషంగా ఉండేవారని చెప్పారు. మరోవైపు, సత్యనారాయణ రెడ్డి కుటుంబం మృతిపై ఆయన స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు.

ఎన్నో అనుమానాలు
గత 20 రోజుల క్రితం కనిపించకుండాపోయిన ఈ కుటుంబం అదృశ్యం విషాదాంతంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయినా ఫిర్యాదు అందిందా? లేదా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, కరీంనగర్‌లోని ఈ కెనాల్‌ వద్ద గత రెండు నెలల కాలంలోనే దాదాపు 10 నుంచి 15 ప్రమాదాలు జరిగినట్టు సమాచారం. ఇరుకైన వంతెన కావడం, రెయిలింగ్‌ కూడా సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఘటనా స్థలం వద్దకు తరలివచ్చిన స్థానికులు..
ఎమ్మెల్యే సోదరి కుటుంబం మరణవార్తతో ఆ కుటుంబ సభ్యులు, ప్రజలు ఘటనా స్థలానికి తరలి వస్తున్నారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో అక్కడే శవపంచనామా నిర్వహిస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తరలించనున్నారు. మరోవైపు ఈ ఘటనల నేపథ్యంలో కాకతీయ కాల్వకు నీటిని పూర్తిగా నిలిపివేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని