పోలీసుల దెబ్బలు తాళలేకే..

తాజా వార్తలు

Published : 20/04/2020 00:32 IST

పోలీసుల దెబ్బలు తాళలేకే..

ఆరోపించిన మృతుడి సహచరుడు

ముంబయి: ఓ దినసరి కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కాగా పోలీసుల తీవ్రంగా కొట్టడంతోనే  అతను మరణించినట్లు అతని స్నేహితుడు ఆరోపించాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సహచరుడి వివరాల ప్రకారం.. ముంబయిలోని డోంగ్రి ప్రాంతానికి చెందిన దినసరి కూలీ సాగిర్‌ జమిల్‌ ఖాన్‌ శనివారం రాత్రి నల్‌ బజార్‌ ప్రాంతంలో తోపుడు బండిలో ఓ ఫ్రిజ్‌ను డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా పూల్‌వాలీ గల్లీలో నాకాబందీలో ఉన్న పోలీసులు అడ్డగించి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో తల, చేతులు, వీపుపై తీవ్రంగా కొట్టినట్లు ఖాన్‌ తనతో తెలిపినట్లు అతడు విలేకర్లతో వెల్లడించాడు. రాత్రి భోజనం చేసే సమయంలో ఖాన్‌ అకస్మాత్తుగా కిందపడిపోయాడని, వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారని వాపోయాడు. 

కాగా ఈ విషయంపై జోన్‌-1 డిప్యూటీ కమిషనర్‌ పంగ్రామ్‌సింగ్‌ నిశాందార్‌ స్పందించారు. జమిల్‌ ఖాన్‌ గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందినట్లు తెలిపారు. అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేనట్లు వెల్లడించారు. పోలీసులు నాకాబందీ ఉన్న ప్రాంతానికి, మృతుడు వెళ్లిన ప్రాంతానికి చాలా దూరం ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు వెల్లడించారు. నివేదికలను వైద్య పరీక్షలకు పంపించి, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

గత నెలలోనూ ముంబయి పోలీసులపై ఈ తరహా ఆరోపణలే వచ్చాయి. నెహ్రూనగర్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించాడనే కారణంతో పోలీసులు రాజు వేలు దేవేంద్ర అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. సదరు వ్యక్తి ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతుండగా స్థానికులు బంధించి కొట్టారని, అందుకే ఆ వ్యక్తి మరణించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఎనిమిది మంది స్థానికులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని