నన్నేమీ చేయలేవు..

తాజా వార్తలు

Published : 02/07/2020 01:14 IST

నన్నేమీ చేయలేవు..

తమిళనాడు కస్టడీ మరణాలు: ప్రత్యక్ష సాక్షి కథనం
న్యాయమూర్తి కంగుతినే విధంగా పోలీసుల ప్రవర్తన

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న తండ్రీ, కుమారుల పోలీసు కస్టడీ మృతి ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన న్యాయమూర్తి, అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూత్తుకుడిలో మొబైల్‌ షాపు యజమానులైన పి జయరాజ్‌ (59), ఆయన కుమారుడు జె బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలోమృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, ఈ విషయమై విచారణ చేసేందుకు వెళ్లిన కోవిల్‌పట్టి న్యాయమూర్తి ఎంఎస్‌ భారతీదాసన్‌తోనే పోలీసు సిబ్బంది బెదిరింపు ధోరణిని అవలంభించినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన మద్రాస్‌ హైకోర్టు న్యాయస్థానం మదురై బెంచ్‌కు నాలుగు పేజీల నివేదికను సమర్పించారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం...

విచారణ ఇలా సాగింది...

తూత్తుకుడి జిల్లాలోని సతన్‌కుళం పోలీస్‌ స్టేషన్‌లో జయరాజ్‌, బెన్నిక్స్‌లపై జూన్‌ 19న విచారణ జరిగింది. అనంతరం వారు తీవ్ర గాయాల వల్ల జూన్‌ 22న మరణించారు. కాగా, వీరు పోలీసుల దౌర్జన్యం వల్లనే చనిపోయారా అనే విషయాన్ని విచారించేందుకు వెళ్లిన న్యాయమూర్తినే పోలీసు సిబ్బంది బెదిరింపులకు గురిచేశారు. ఒకే ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మహిళా పోలీసు.. ఇతర సిబ్బందితో సమస్యలు ఎదురుకాగలవని భయంతో వణికిపోయారు. అయితే ఆమె స్థిమిత పడేందుకు కొంత సమయం ఇచ్చిన అనంతరం విచారణ కొనసాగించారు. ఆమె లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం.. జయరాజ్‌, బెన్నిక్స్‌లను ఆ రాత్రంతా కొడుతూనే ఉన్నారని తెలిసింది. అంతేకాకుండా లాఠీలు, టేబుల్‌పై రక్తపు మరకలు ఉన్నట్టు కూడా ఆమె తెలిపారు. ఇక స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీ కెమేరా ఆటో-డిలీట్‌ మోడ్‌లో ఉండటం వల్ల నాటి రాత్రికి సంబంధించిన ఫుటేజ్‌ కూడా లభించలేదని తెలిసింది. చివరగా మెజిస్ట్రేట్‌ను కానిస్టేబుల్‌ మహరాజన్‌ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని బెదిరించినట్టు కూడా తెలిసింది. 

అధ్వాన్నం, భయానకం...

జూన్‌ 28న  పోలీస్‌ స్టేషన్‌లో 15 గంటల పాటు విచారణ సాగింది. ‘‘పోలీసులు తమ బలాన్ని ప్రదర్శించే విధంగా నా ముందే శారీరిక భంగిమలు ప్రదర్శించారు. రికార్డులు, దస్తావేజులను అందించటంలో  పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కావాలని ఆలస్యానికి పాల్పడ్డారు. హార్డ్‌ డిస్క్‌లో అత్యధికంగా ఒక టెరాబైట్‌ స్టోరేజ్‌ ఉన్నప్పటికీ, ఫుటేజ్‌ అంతా ఏరోజుకారోజు చెరిగిపోయే విధంగా అమర్చారు. ఘటనా సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని లాఠీలు సమర్పించమని అడిగినప్పుడు వారు విననట్టే నటించారు. తొలుత తన లాఠీ స్వగ్రామంలో ఉందన్న కానిస్టేబుల్‌ మహరాజన్‌... తర్వాత అది పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉందన్నాడు. చివరకు తన వద్ద అసలు లాఠీయే లేదని చెప్పాడు. ఒక దశలో మేజిస్ట్రేటు వెనుక నిలుచున్న మహారాజన్‌, ఆయన తనను ఏమీ చేయలేరని నిందాత్మకంగా మాట్లాడాడు. ఇక మరో ఉద్యోగి విచారణను తప్పించుకొనేందుకు స్టేషన్‌ నుంచి పరిగెత్తాడు. స్టేషన్‌లో వాతావరణం అశాంతిగా, అధ్వాన్నంగా, భయంగొలిపేదిగా ఉంది. అంతేకాకుండా పోలీసు సిబ్బంది తొలి నుంచి అవిధేయతను, సహాయ నిరాకరణ ధోరణిని ప్రదర్శించారు.’’ అని మేజిస్ట్రేటు భారతీదాసన్‌ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ మేరకు ఆయన తన నివేదికను రిజిస్ట్రార్‌కు జూన్‌ 29న ఈ మెయిల్‌ ద్వారా పంపారు.

పోలీసు శాఖలో బదిలీల కలకలం
విచారణకు హాజరయిన మహిళా పోలీసుకు రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మరణాల ఘటనతో సంబంధమున్న సిబ్బందిపై హత్యానేరం క్రింద విచారణ జరుగుతుందని వివరించింది. కాగా, ఈ ఘటన తమిళనాడు పోలీసు శాఖలో కలకలం రేపింది. కస్టడీ మరణాలు జరిగిన మరుసటి రోజే ఆ శాఖలో 39 బదిలీలు చోటుచేసుకున్నాయి. డీఎస్పీ సీ ప్రతాపన్‌, ఏడీఎస్పీ డీ కుమార్‌, కానిస్టేబుల్‌ మహరాజన్‌లు మేజిస్ట్రేటు దర్యాప్తుకు ఆటంకం కలిగించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సంబంధిత కానిస్టేబుల్‌ పై సస్పెన్షన్‌ వేటు వేయగా... ఇరువురు ఉన్నతాధికారులను వెయిటింగ్‌లో ఉంచారు. కాగా, ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలను గత వారం లోనే సస్పెండ్‌ చేశారు. అయితే కోర్టు నిరవధిక వెయిటింగ్‌లో ఉంచాలని ఆదేశించినప్పటికీ... ప్రతాపన్‌ను ‘యాంటీ లాండ్‌ గ్రాబింగ్ స్పెషల్‌ సెల్‌’లో... కుమార్‌ను ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలోను నియమించటం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని