దాచి... పాచి... వేడిగా వడ్డించి..!

తాజా వార్తలు

Updated : 11/11/2020 09:02 IST

దాచి... పాచి... వేడిగా వడ్డించి..!

నిల్వ ఉంచిన మాంసంతో హోటళ్ల వ్యాపారం

విజయవాడ: ఆదివారం అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది మాంసం. ఎంచక్కా.. ఇంటికి మటనో, చికెనో తీసుకొచ్చి రకరకాల వెరైటీలు చేసుకునే వారు ఎందరో. హోటళ్లు, రెస్టారెంట్లకున వెళ్లి రుచులను ఆస్వాదించే వారు ఇంకొందరు. ఎంతో లొట్టలేసుకుని తినే ఆ మాంసం నాణ్యత ఎంత? అని ప్రశ్నించుకుంటే అనేక సందేహాలు ముసురుతాయి. దీనికి కారణం ఇటీవల విజయవాడ నగరంలో ఆహార తనిఖీ, నగరపాలిక అధికారుల తనిఖీల్లో విస్తుపోయే అనేక విషయాలు వెలుగుచూశాయి. ఎప్పుడో కోసిన మాంసాన్ని తెచ్చి రోజుల తరబడి నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు తేలింది. ఎక్కడ పడితే అక్కడ జీవాలను కోస్తున్నారు. ఇలాంటి మాంసం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇంత దారుణమా..!
గత వారం.. ఆహార తనిఖీ, విజిలెన్స్‌ అధికారులు విజయవాడలోని బార్బిక్‌ నేషన్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిజ్‌లో ఏకంగా 150 కిలోల మటన్‌ను నిల్వ ఉంచారు. అది కూడా కనీసం 15 రోజుల నాటిది. బాగా గడ్డకట్టి కుళ్లిపోయే దశకు చేరుకుంది. కిలో రూ. 480 లెక్కన కొనుగోలు చేశారు. రూ. 800 వరకు అమ్మే మాంసం ఇంత తక్కువ ధరకు తెచ్చారా? అని విస్తుపోవడం అధికారుల వంతైంది.
జు నాలుగు రోజుల క్రితం.. బెజవాడలోని గొల్లపాలెం గట్టు ప్రాంతంలోని ఓ మాంసం విక్రయశాలపై కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడి ఫ్రిజ్‌ తెరిచి చూస్తే.. అధికారులకు నోట మాటరాలేదు. 10 రోజుల నాటి మాంసాన్ని నిల్వ ఉంచారు. శీతల యంత్రం తుప్పు పట్టి ఉంది. మాంసం పురుగులు పట్టడాన్ని గమనించారు. కార్పొరేషన్‌ తనిఖీ, ముద్ర లేకుండానే వధించి అమ్ముతున్నారు. ఈ దాడుల్లో 400 కిలోల మాంసం దొరికింది.
తక్కువకు వస్తోందని..
వయస్సు మీరిన, అనారోగ్యంతో ఉన్న జంతువులను వ్యాపారులు తీసుకొస్తున్నారు. ఆరోగ్యంతో ఉన్న వాటి కంటే ఇవి మూడో వంతు తక్కువే వస్తాయి. ప్రకాశం, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం సంతలు జరుగుతుంటాయి. అక్కడ రోగాల బారిన పడిన వాటిని కొనుగోలు చేసి, శనివారం రాత్రికి విజయవాడకు తెస్తున్నారు. వీటిని తెచ్చి వైద్యుడి ధ్రువీకరణ లేకుండానే.. అనధికారికంగా వధించి, మామూలు మాంసంతో కలిపి అమ్ముతున్నారు. ఈ నాసిరకమైన మాంసాన్నే హోటళ్లు, రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వారు ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసి రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి దానినే వండి వడ్డిస్తున్నారు.

రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసం (దాచిన చిత్రం)

నిబంధనలు ఇవీ...
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం ప్రకారం పాటించాల్సిన నిబంధనలు ఇవీ..
* ఏదైనా జంతువును వధించాలంటే తప్పనిసరిగా యాంటీమార్టం చేయాలి. 48 గంటల ముందు సంబంధిత కబేళాలోని పశువైద్యుడు పరీక్షించాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధరించి, ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.
* దీని ఆధారంగా కబేళాకు తీసుకెళ్తే.. ముద్ర వేసి జంతువును వధిస్తారు. తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించి, ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చాలి.
* కళేబరాన్ని మాంసపు దుకాణానికి తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టాలి. ఆ రోజు మాంసం మిగిలితే.. దానిని - 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కొన్ని గంటల పాటే భద్రపర్చాలి.
* సంబంధిత ఆరోగ్య విభాగం అధికారులు దుకాణాలను పరిశీలించాలి. ముద్ర ఉన్న జంతువు మాంసాన్నే విక్రయిస్తున్నారా? లేదా అన్న చూడాలి.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం: 
డా. బత్తిని రాజేష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, విజయవాడ
సరైన ఉష్ణోగ్రత లేకపోతే బ్యాక్టీరియా, వైరస్‌ వృద్ధి చెందుతాయి. రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇటువంటి పదార్థాలను సరిగా వండకుండా తింటే ఫుడ్‌ పాయిజనింగ్‌ అవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం వస్తాయి. ఉదర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ముదిరితే కిడ్నీలు, లివర్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణుల్లో ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లే ప్రమాదం ఉంది. మంచి మాంసానికి వాసన ఉండదు. గులాబీ రంగులో ఉంటుంది. పాడైంది అయితే.. దుర్వాసన వస్తుంది, పట్టుకుంటే జిగటగా ఉంటుంది. నీలి, గోధుమ రంగులో కనిపిస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని