close

తాజా వార్తలు

Published : 15/01/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాటు తుపాకీతో బెదిరించి దోచేస్తారు

9 మంది బందిపోటు దొంగలు సహా ఇద్దరు వ్యాపారుల అరెస్ట్‌

స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: అర్ధరాత్రి 11.30 గంటలకు బొలేరో వాహనంలో బయలుదేరుతారు. తెల్లవారుజామున 3 గంటల వరకే చోరీలు చేస్తారు. నాటు తుపాకీతో కాపలాదారులను బెదిరిస్తారు. వరుస చోరీలతో సైబరాబాద్‌ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన అంతరాష్ట్ర దోపిడి ముఠా ఎట్టకేలకు చిక్కింది. వివరాలను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. దుండిగల్‌ ఠాణా మల్లంపేట్‌లో నిర్మాణంలో ఉన్న ప్రణీత్‌ ప్రణవ్‌ లీఫ్‌ విల్లాస్‌లో ఈ నెల 9న అర్ధరాత్రి రూ.24 లక్షల విలువైన విద్యుత్‌ సామగ్రి చోరీకి గురయ్యింది. ఈ నెల 12న అర్ధరాత్రి దుండిగల్‌ టోల్‌ గేట్‌ దగ్గర వాహనాల తనిఖీ  సమయంలో ఆగకుండా వెళ్లిన బొలెరో  వాహనాన్ని మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర పట్టుకున్నారు. తనిఖీ చేయగా నాటు తుపాకీ, కట్టెలు, తాళ్లు, ఇతరత్రా సామాగ్రి, సీటు లోపల దాచిపెట్టిన డబ్బు లభించింది. రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్‌ కుష్వాహా(27), కుల్దీప్‌(23)తో పాటు యూపీవాసి శైలేంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మల్లంపేట్‌లో చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. శంకర్‌పల్లి, ఆర్సీపురం, నార్సింగి ఠాణాలో పరిధిలోని మరో ఆరు చోట్ల కూడా దొంగతనం చేసినట్లు తెలిపారు. ఆ ముగ్గురిచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్‌కు చెందిన మాధవ్‌ సింగ్‌(29), ధర్మేందర్‌ సింగ్‌(32), సంజయ్‌(21), ఉత్తరప్రదేశ్‌వాసులు నిహాల్‌ సింగ్‌(22), శైలేంద్రసింగ్‌(22), ధర్మేంద్ర కుమార్‌(26), సత్యభన్‌ సింగ్‌(23)ను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తును కొనుగోలు చేసిన కొండాపూర్‌లోని దీపక్‌ ఎలక్ట్రికల్స్‌ యజమాని మనీష్‌ కుమార్‌, స్క్రాప్‌ డీలర్‌ గోవుల విజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులంతా గతంలో దిల్లీలో ఎలక్ట్రీషియన్లుగా పనిచేశారు. అక్కడ చోరీలు చేసి జైలుపాలయ్యారు. ఆ తర్వాత 2019లో హైదరాబాద్‌కొచ్చారు. నిందితులు ఈ నెల 6న శంకర్‌పల్లి ఠాణా పరిధిలోని మోఖిల్లాలో రూ.5 లక్షలు, 8న తెల్లాపూర్‌లో రూ.2.2 లక్షలు, 9న మల్లంపేట్‌లో రూ.24 లక్షల విలువైన విద్యుత్‌ సామాగ్రిని దొంగిలించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్లు వెంకటేశం(దుండిగల్‌), ప్రవీణ్‌రెడ్డి(మేడ్చల్‌), రమణారెడ్డి(బాలానగర్‌ ఎస్వోటీ), వెంకట్‌రెడ్డి(శంషాబాద్‌ ఎస్వోటీ), ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి(దుండిగల్‌ పీఎస్‌)ని సజ్జనార్‌ అభినందించారు.Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని