Cyber Crime: రూ.లక్ష ఇవ్వండి.. రోజూ రూ.5వేలు తీసుకోండి

తాజా వార్తలు

Updated : 28/06/2021 07:35 IST

Cyber Crime: రూ.లక్ష ఇవ్వండి.. రోజూ రూ.5వేలు తీసుకోండి

యాప్‌లలో పెట్టుబడి.. వర్చువల్‌ లావాదేవీలు

కోల్‌కతా, దిల్లీ కేంద్రాలుగా నయామోసాలు

ఈనాడు,హైదరాబాద్‌

కొత్తగా ప్రారంభించిన మా మొబైల్‌ యాప్‌ ట్రేడింగ్‌లో రూ.లక్ష మదుపు చేస్తే.. నిత్యం రూ.5 వేలు తీసుకోండి. ఇరవై రోజుల్లో రూ.లక్ష వస్తాయి. ఇందులో మోసం లేదు. దగా లేదు. రోజుకు రూ.ఐదు వేలు విత్‌డ్రా చేసుకోండి.. అంటూ దిల్లీ, కోల్‌కతాలలో ఉంటున్న సైబర్‌ నేరస్థులు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఇరవై రోజుల్లో పెట్టుబడి వస్తుంది.. అసలు అలాగే ఉంటుందన్న ఆశతో వేల మంది యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. రూ.లక్షల్లో మదుపు చేశాక యాప్‌ల ద్వారా లావాదేవీలు స్తంభిస్తుండడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రోజుకు వేల మంది మోసపోతున్నారని, సైబర్‌ నేరస్థులు రూ.కోట్లు కొల్లగొడుతున్నారని పోలీసులు అంచనా వేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి నగరాల్లో ఈ మోసాలు జరుగుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

మదుపు చేశాక.. ఫోన్లు స్విచ్ఛాఫ్‌

రూ.లక్ష పెట్టుబడికి.. రోజుకు రూ.ఐదు వేలు లాభం పొందండి అంటూ సైబర్‌ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. నిత్యం పది, పదిహేను సార్లు ఫోన్‌ చేసి రూ.లక్షల్లో మదుపు చేయించుకుంటున్నారు. అనంతరం వారి ఖాతాలో తొలి రోజు నుంచి ఐదు రోజుల వరకు రూ.ఐదు వేల చొప్పున జమ చేస్తున్నారు. వాటిని తీసుకునేందుకు యాప్‌ నుంచి అనుమతి ఉండేలా షరతు విధిస్తున్నారు. డబ్బు తీసుకుంటాం.. అని ఫోన్‌ చేస్తే.. సాంకేతిక సమస్యలున్నాయి.. మీరు పెట్టుబడి పెట్టండి.. ఒకేసారి తీసుకోండి అంటూ నమ్మిస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెట్టాక.. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.

సత్వర లాభాలంటూ...

తమ యాప్‌లలో పెట్టుబడికి సత్వరం లాభాలు వస్తాయంటూ నేరస్థులు ఆశ చూపిస్తున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ఫోన్‌పే, గూగుల్‌పే ఖాతాను ప్రారంభించమంటున్నారు. అనంతరం బాధితుడి డబ్బు మొత్తం ఆ యాప్‌లో చూపుతున్నారు. లాభం వేస్తున్నామంటూ రోజూ సాయంత్రం ఫోన్‌ చేసి యాప్‌లో అంకెలు చూపిస్తున్నారు. మరికొందరు సైబర్‌ నేరస్థులు పది, పదిహేను రోజులకే రెట్టింపు డబ్బు వస్తుందని చెబుతున్నారు.

* అమీర్‌పేటలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వంశీమోహన్‌ మూడు నెలల క్రితం జిప్‌బిట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. తొలుత రూ.వెయ్యి పెట్టుబడి పెడితే.. సాయంత్రానికి రూ.500 లాభం వచ్చిందంటూ సైబర్‌ నేరస్థుడు చెప్పాడు. తర్వాత రూ.లక్ష పెట్టుబడిగా పెట్టమన్నారు. వంశీ నమ్మేందుకు కొన్ని రోజులు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలా మూడు నెలల్లో రూ.60 లక్షలు మదుపు చేయించారు. అతడి యాప్‌లో రూ.5.50 కోట్లు చూపించారు. రూ.2.5 కోట్లు తీసుకుంటా.. రూ.3 కోట్లు మీరే ఉంచుకోండి అంటూ రెండు రోజుల క్రితం అడిగాడు. యాప్‌లింక్‌ను సైబర్‌ నేరస్థులు మాయం చేశారు.

* బంజారాహిల్స్‌లో ఉంటున్న విద్యార్థి సంతోష్‌ తన స్నేహితులు చెబితే పవర్‌బ్యాంక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. తొలుత రూ.500 పెట్టుబడి పెట్టగా.. పది రోజుల్లో రూ.500 తిరిగి వచ్చాయి. రూ.వెయ్యి మదుపు చేస్తే.. పది రోజుల్లో రూ.వెయ్యి వెనక్కి వచ్చాయి. లాభం బాగుందనుకున్న సంతోష్‌ తన స్నేహితులు, బంధువుల వద్ద అప్పు తీసుకుని రూ.5 లక్షలు మదుపు చేశాడు. లాభం కోసం ఫోన్‌ చేయగా యాప్‌ పనిచేయలేదు.

మనీయాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు

- అవినాష్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన)

తక్కువ రోజుల్లో మీ డబ్బు వస్తుందంటూ సైబర్‌ నేరస్థులు రూపొందించిన మనీయాప్‌లు ప్రమాదకరం. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్ధు పది, ఇరవై రోజుల్లో పెట్టుబడి తిరిగి వస్తుందంటూ నేరస్థులు రూపొందించిన యాప్‌లు 350 లకుపైగా గుర్తించాం. గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌లు ఉంచితే పోలీసులు పట్టుకుంటారని అంచనా వేసి.. నేరస్థులు వాట్సాప్‌ లింకుల ద్వారా పంపుతున్నారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు బ్యాంక్‌ ఖాతాలపై ఆధారపడుతున్నాం. ఇరవై రోజుల్లో పెట్టుబడి మొత్తం వస్తుందంటే మోసమే. నేరస్థుల వలలో పడకండి. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులెవరైనా యాప్‌ల గురించి మాట్లాడితే వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని