Crime: వైద్యురాలిని మోసం చేసింది నైజీరియనే

తాజా వార్తలు

Updated : 14/07/2021 11:19 IST

Crime: వైద్యురాలిని మోసం చేసింది నైజీరియనే


మెస్సీ డాన్‌ హో

ఈనాడు,హైదరాబాద్‌: మూలికా వైద్యం సూత్రాలు (ఫార్ములా) విక్రయిస్తే రూ.5 కోట్లు ఇస్తానంటూ వైద్యురాలి నుంచి రూ.42 లక్షలు కొల్లగొట్టిన నైజీరియన్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీలో పట్టుకున్నారు. 15 రోజులపాటు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్‌ ఖాతాలు, చిరునామాలు పరిశోధించి ఈ నేరానికి పాల్పడింది దిల్లీలో ఉంటున్న మెస్సీ డాన్‌హోగా గుర్తించారు. ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి మోహన్‌ గార్డెన్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ఉంటున్న డాన్‌హోను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 37 ఏటీఎం కార్డులు, 12 పాసు పుస్తకాలు, 13 చెక్కు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

బేకరి.. కూల్‌డ్రింక్స్‌ దుకాణం.. అంతర్జాల మోసాలు

మెస్సీడాన్‌హో(34) నైజీరియాలో సరైన ఉపాధి అవకాశాల్లేక మూడేళ్ల క్రితం వ్యాపార పాస్‌పోర్టుతో దిల్లీకి వచ్చాడు. అంతర్జాల మోసాలు చేసేందుకు పోలీసులకు అనుమానం రాకుండా మోహన్‌ గార్డెన్స్‌లో ఓ చిన్న బేకరి, కూల్‌డ్రింక్స్‌ దుకాణాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించాడు. కరోనా నేపథ్యంలో మందులు, ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, పరికరాలకు గిరాకీ ఉందని తెలుసుకున్న మెస్సీ.. వైద్యులు, ఫార్మా కంపెనీల వారికి ఫోన్లు చేసి ఆ పరికరాలు తక్కువ ఖర్చుకు ఇప్పిస్తానని నగదు బదిలీ చేయించుకుని మోసం చేశాడు.

కుమార్తె చనిపోయిందని అబద్ధం

మెహిదీపట్నంలో ఉంటున్న వైద్యురాలికి 20 రోజుల క్రితం ఫోన్‌ చేసిన మెస్సీ తనను లండన్‌లో ఉంటున్న వైద్య నిపుణుడిగా పరిచయం చేసుకున్నాడు. వైద్యురాలు తయారు చేస్తున్న మూలికల ఫార్ములా విక్రయిస్తే రూ.5 కోట్లు ఇస్తానంటూ చెప్పాడు. దిల్లీ విమానాశ్రయానికి పార్సిల్‌ పంపించానని, అందులో పౌండ్లు ఉన్నాయని నమ్మించాడు. ఆర్‌బీఐ పన్ను, కస్టమ్స్‌ సుంకాల పేరుతో రూ.42 లక్షలు కొట్టేసిన మెస్సీ.. తాను దిల్లీకి తెచ్చిన పౌండ్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఈలోపు తన కూతురు చనిపోయిందని వైద్యురాలికి చెప్పాడు. తిరిగి లండన్‌ వెళ్లేందుకు రూ.20వేలు కావాలంటూ అడగ్గా.. ఆమె డబ్బు పంపింది. తరువాత మెస్సీ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. మరోవైపు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పాస్‌పోర్టు గడువు పూర్తికావడంతో గతేడాది అక్టోబరులో మోహన్‌ గార్డెన్‌ ఠాణా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని