Cyber Crime: కిడ్నీలకు బేరం.. తర్వాత ఘోరం! 

తాజా వార్తలు

Published : 20/08/2021 09:34 IST

Cyber Crime: కిడ్నీలకు బేరం.. తర్వాత ఘోరం! 

మూత్రపిండాలు కావాలంటూ వల  
ఒక్కోదానికి రూ. 2, 3 కోట్లు దక్కుతాయని ప్రచారం
వైద్యపరీక్షల పేరుతో వసూళ్లు 
సైబర్‌ నేరగాళ్ల కొత్త అవతారం

‘మూత్రపిండాలు దానం చేయండి.. కృతజ్ఞతగా వారు ఇచ్చే భారీ మొత్తం తీసుకోండి..‘అంటూ సైబర్‌ నేరస్థులు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో మూత్రపిండాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు కొంటారని, నమ్మిస్తున్నారు. ‘కిడ్నీ డొనేషన్‌ ఇండియా’, ‘సేల్‌ ఆఫ్‌ కిడ్నీ ఫర్‌ మనీ’ పేర్లతో వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌.. వాట్సప్‌లకు సందేశాలు పంపుతున్నారు. కొవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు కొందరు ఈ ప్రచారాలను నమ్మి ఫోన్లు చేస్తున్నారు. ఇంకేముంది వైద్యపరీక్షలు.. రిపోర్టులు.. ఆదాయపు పన్ను పేర్లతో అమాయకుల నుంచి రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్‌కు చెందిన దంపతులు సైబర్‌ నేరస్థుల చేతిలో మోసపోయి రూ. 40 లక్షలు చెల్లించుకున్నారు. పోలీసులు విచారించి బెంగళూరు, దిల్లీ నుంచి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని గుర్తించారు. వీరిలో 90 శాతంమంది నైజీరియన్లేనని, మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ వివరించారు.

ప్రముఖ ఆసుపత్రుల పేర్లతో..

మూత్రపిండాలను కొంటామంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సైబర్‌ నేరస్థులు మూత్రపిండాల మార్పిడిలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆసుపత్రుల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నారు. దీంతో అమాయకులు సులభంగా వారి వలలో పడుతున్నారు. దిల్లీలోని మూల్‌చంద్, బీఎల్‌కే, ముంబయిలోని బ్రీచ్‌కాండీ, బెంగళూరులోని మణిపాల్, హైదరాబాద్‌లో రెండు ప్రముఖ ఆసుపత్రులు, చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. మా ఆసుపత్రిలో కిడ్నీ దానం చేస్తే.. రూ. 5 కోట్లు ఇస్తామంటూ బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రి పేరుతో సైబర్‌ నేరస్థులు వెబ్‌సైట్‌లో ప్రకటనలు కూడా ఇచ్చారు. వాటి గురించి ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఒక బాధితుడి ఫిర్యాదుతో ముంబయి పోలీసులు ఆన్‌లైన్‌లో పరిశీలించగా.. 100 ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లున్నాయని తేలింది. వాటి గురించి ఆయా ఆసుపత్రులకు సమాచారమిచ్చారు.

కష్టాల నుంచి గట్టెక్కేందుకు..

ఖైరతాబాద్‌లో ఉంటున్న దంపతులు కిరాణా షాపు నడుపుతున్నారు. హోల్‌సేల్‌ దుకాణంగా మార్చేందుకు అవసరమైన భవనం కట్టుకుందామని అనుకున్నారు. కొవిడ్‌ కారణంగా నష్టాలు రావడంతో అప్పులు చేయక తప్పలేదు. దీంతో మూత్రపిండాలు అమ్ముకోవాలని భావించారు. అంతర్జాలంలో శోధిస్తే దిల్లీలోని హోప్‌ కిడ్నీసెంటర్‌ పేరుతో వివరాలు కనిపించాయి. వారితో సంప్రదించగా.. ఒక్కో కిడ్నీకి రూ. 5 కోట్లు ఇస్తామన్నారు. ముందుగా కొంత చెల్లించాలని చెప్పారు. రకరకాల కారణాలు చెప్పి మూడునెలల్లో రూ. 40 లక్షలు వసూలు చేశారు.

విజయవాడ దంపతుల ప్రయాస..

విజయవాడలోని ఆటోనగర్‌లో ఉంటున్న దంపతులు మెడికల్‌ షాపు పెట్టి.. నష్టాలు రావడంతో మూసేశారు. అప్పులు ఇంకా మిగలడంతో మూత్ర పిండాలు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. కొద్దినెలల క్రితం ‘కిడ్నీ డొనేషన్‌ ఇండియా’ వెబ్‌సైట్‌ను చూసి అందులో నంబర్‌కు ఫోన్‌ చేశారు. డాక్టర్‌ చోప్రా పేరుతో సైబర్‌ నేరగాడు మాట్లాడాడు. కిడ్నీ దానం చేసేందుకు దిల్లీకి రావాలని చెప్పాడు. ఒక్కో కిడ్నీకి రూ. 2 కోట్లు ఇస్తానన్నాడు. వైద్యపరీక్షలు, రవాణా ఖర్చుల పేరుతో రూ. 16.60 లక్షలు వసూలు చేశాడు. ఎప్పుడు రావాలని అడిగేందుకు ఫోన్‌ చేయగా.. స్పందించలేదు.

చెల్లి పెళ్లి చేసేందుకు..

సూరత్‌లో ఉంటున్న రాణా చిరు వ్యాపారి. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం దెబ్బతింది. అప్పటికే చెల్లి పెళ్లి నిశ్చయం కావడంతో.. రాణా తన స్నేహితుడి సూచన మేరకు కిడ్నీ అమ్ముకోవాలని అనుకున్నాడు. ఓ వెబ్‌సైట్‌లో కిడ్నీ కావాలనే ప్రకటన చూసి ఫోన్‌ చేశాడు. మూత్రపిండం ఇస్తే రూ. 4 కోట్లు ఇస్తామని సైబర్‌ నేరస్థుడు చెప్పాడు. ఇందుకోసం ముందుగా కొంత రుసుం చెల్లించాలని చెప్పగా మళ్లీ అప్పు చేసి రూ. 14.70 లక్షలు చెల్లించాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ నిందితుడికి ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది.

ఇష్టానుసారం దానం కుదరదు:
మన దేశంలో మూత్రపిండాల మార్పిడికి కొన్ని ప్రమాణాలున్నాయి. ఇష్టానుసారంగా దానం, మార్పిడి కుదరవు. రూ. 2 కోట్లు, రూ. 5 కోట్లు ఇస్తాం అంటూ నిందితులు చెబుతున్న మాటలు వాస్తవం కాదు. అలాంటివారు మోసగాళ్లని గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా మూత్రపిండాలు అవసరమైతే జీవన్‌దాన్‌ ట్రస్టు ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రాధాన్య క్రమంలో వారికి అవకాశం వస్తుంది. అలాగే అవసరమైనవారికి రక్త సంబంధీకులు దానం చేయవచ్చు.. ఇది కూడా వైద్యులు, ప్రభుత్వ అనుమతులతోనే జరుగుతుంది.-అవినాష్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన)


- ఈనాడు, హైదరాబాద్‌  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని