AP News: ప్రేమ పేరుతో మూడో పెళ్లి

తాజా వార్తలు

Updated : 13/06/2021 12:12 IST

AP News: ప్రేమ పేరుతో మూడో పెళ్లి

రూ.6 లక్షలు దోచుకొని పరారైన మహిళ
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తాను అనాథనని నమ్మించి మూడో పెళ్లి చేసుకుంది. వివిధ కారణాలు చెప్పి యువకుడి నుంచి లక్షల్లో దండుకొని పరారైంది. ఈ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి ఎస్సై పరమేశ్‌నాయక్‌ కథనం మేరకు.. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు (29) ఐదేళ్లుగా మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తూ తిరుపతి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేసే ఎం.సుహాసిని (35)తో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథని చెప్పడంతో యువకుడు కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే యువతికి 8 తులాల బంగారు నగలు పెట్టారు. ‘నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి ఆరోగ్యం సరిగా లేదు. పెళ్లికి ముందు అప్పులు చేశాను’ అంటూ ఆమె యువకుడి నుంచి వివిధ రూపాల్లో రూ.4 లక్షలు తీసుకుంది. అంతేకాక తన తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుందని తెలియడంతో యువకుడు ఈ నెల 7న ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఇంట్లో యువతి ఆధార్‌కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా.. నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ఈలోగా సుహాసిని ఆ యువకుడికి ఫోన్‌ చేసింది. ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా. త్వరలో నీ డబ్బులు ఇచ్చేస్తా. పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బంది పడతావు’ అని హెచ్చరించింది. ఏడాదిన్నర కిందట రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలనూ యువకుడికి పంపింది. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని