అమెరికా నుంచి భారత్‌లో భార్య హత్యకు కుట్ర

తాజా వార్తలు

Published : 30/05/2021 01:37 IST

అమెరికా నుంచి భారత్‌లో భార్య హత్యకు కుట్ర

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
హతురాలి కుటుంబసభ్యుల అనుమానంతో బయటపడ్డ నేరం  
తమిళనాడులో ఘటన 

చెన్నై: అమెరికాలో ఉన్న భర్త భారత్‌లో ఉన్న భార్యను కిరాయి హంతకులతో హత్య చేయించిన అమానుష ఘటన తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో కలకలం రేపింది. పట్టపగలే భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిందితుడు ప్రయత్నించాడు. కానీ హతురాలి కుటుంబసభ్యుల అనుమానంతో ఆ కుట్ర మొత్తం బయటపడింది. కిదరకొండమ్‌ పట్టణంలో ఈ నెల 21న ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జయభారతి(28) తన విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా, కడవయ్యూరు బ్రిడ్జి వద్ద ఓ మినీ ట్రక్కు ఎదురుగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. అంతే, రెప్పపాటులో ఆమె అమాంతం ఎగిరి కొంతదూరంలో పడిపోయింది. గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోనే ఆమె కన్ను మూసింది. 

తండ్రి అనుమానంతో వెలుగుచూసిన కుట్ర:
రోడ్డు ప్రమాదంలో జయభారతి మృతి చెందినట్టు అందరూ భావించినప్పటికీ.. కుమార్తె మరణంపై ఆమె తండ్రి చిదంబరం అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ప్రమాదం గురించి వివరాలు సేకరించారు. అనంతరం వాటితో తిరువారూరు పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె  వైవాహిక జీవితం గురించి కూడా వివరాలు సేకరించారు. జయభారతికి 2015లో విష్ణు ప్రకాశ్‌తో వివాహం జరిగింది. అతడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సంసారంలో దంపతులిద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు తరచుగా గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో భర్తను వదిలి జయభారతి భారత్‌లోని పుట్టింటికి వచ్చేశారు. అంతకుడిలోని పోస్టాఫీసులో ఆమె తాత్కాలికంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఎంతగా సర్ది చెప్పినా వారిద్దరి మధ్య రాజీ కుదరలేదు. చివరికి ఆమె భర్తకు విడాకుల నోటీసులు పంపారు. కానీ  ఎక్కువ మొత్తంలో భరణం చెల్లించాల్సి వస్తుందనే భయంతో విడాకుల నోటీసును వెనక్కి తీసుకోవాలంటూ అతడు భార్యను, ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం ప్రారంభించాడు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాక్షులను విచారించడం సహా సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించారు. ఆ సమయంలో వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఇంతకుముందు ఆమెను అనుసరించిన ట్రక్కుతోనే ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ట్రక్కు యజమాని సెంథిల్‌ కుమార్‌ను విచారించగా తనకు  ప్రమాదం గురించి ఏమీ తెలియదని, వాహనాన్ని అంతకుముందే ఇతరులకు విక్రయించానని తెలిపాడు. అనంతరం  ట్రక్కు డ్రైవరు ప్రసన్న, జగన్‌, రాజాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారిచ్చిన సమాధానాలు ఘటనకు విరుద్ధంగా ఉండటంతో పోలీసులకు వారిపై అనుమానం బలపడింది. విష్ణు ప్రకాశ్‌  సోదరి భర్త సెంథిల్ కుమార్‌ ఈ పథకాన్ని అమలు చేసినట్టు తెలుసుకున్నారు. కుట్రలో భాగంగానే ట్రక్కును అమ్మినట్లు అతడు నాటకం ఆడాడని పోలీసులు గ్రహించారు. తన బావ సూచన మేరకే కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడు. సినీ ఫక్కీలో జరిగిన హత్యను పోలీసులు 12 గంటల్లోనే ఛేదించి, అందులో పాల్గొన్న నలుగురు కిరాయి హంతకులను అరెస్టు చేశారు. అయితే సెంథిల్‌కు ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడు చికిత్స పొందుతున్నాడు. హత్యకు ప్రధాన సూత్రధారి విష్ణు ప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఎస్పీ కయల్విలి తెలిపారు. త్వరలోనే నిందితుణ్ని భారత్‌కు రప్పించనున్నట్లు పేర్కొన్నారు.      


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని