Cheddi Gang: మధ్యాహ్నం మహిళల రెక్కీ.. రాత్రి మగ దొంగల బీభత్సం

తాజా వార్తలు

Published : 24/07/2021 09:43 IST

Cheddi Gang: మధ్యాహ్నం మహిళల రెక్కీ.. రాత్రి మగ దొంగల బీభత్సం

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఆరు నెలలకోసారి చెడ్డీ గ్యాంగ్‌ నగర శివారు పరిధిలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా తప్పించుకుంటూ సవాల్‌ విసురుతున్నారు. ఈ గ్యాంగ్‌ ఇళ్ల తాళాలు పగలకొట్టి చాకచక్యంగా దొంగతనం చేయడంలో దిట్ట. ఒక ప్రాంతంలో అడుగుపెట్టారంటే కనీసం 3 దొంగతనాలు చేసి ఉడాయిస్తారు. పోలీసులు బృందాలుగా వీడిపోయి గస్తీ నిర్వహిస్తున్నా ఉహించని రీతిలో దొంగతనాలు చేసి మాయమవుతున్నారు. ఈ గ్యాంగ్‌ దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజీ పరిశీలిస్తేగానీ తెలియదు. కాలనీలవాసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు సైతం ప్యాట్రోలింగ్, గస్తీ బృందాలు పెంచాలని కాలనీల వాసులు కోరుతున్నారు. కేపీహెచ్‌బీ పరిధిలో సుమారు రెండేళ్ల కిందట, అంతకుముందు ఏడాది సంక్రాంతి సమయంలో ఈ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుంటుంది.

ఇలా పసిగడతారు

ఉదయం ఆ గ్యాంగ్‌ మహిళలు దుప్పట్లు, బొమ్మలు విక్రయిస్తున్నట్లు కాలనీల్లో సంచరిస్తుంటారు. ఈక్రమంలో ఇళ్ల బాల్కనీలు, ఆరుబయట ఆరేసిన దుస్తుల ఆధారంగా ఖరీదైన ఇళ్లుగా గుర్తిస్తారు. వీరు రాత్రి దొంగతనానికి వచ్చే పురుషులకు చూపిస్తారు. వీరు నలుగురు నుంచి అయిదుగురు వరకు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి దాటాకే కాలనీల్లోకి ప్రవేశిస్తారు. దొరికినా చిక్కకుండా ఒంటికి నూనె పూసుకుని బనియన్, చెడ్డీ వేసుకుని అడుగుల శబ్దం వినిపించకుండా చెప్పులు చేత పట్టుకోవడం లేదా నడుముకు కట్టుకుంటారు. ఇనుపరాడ్‌తో శబ్దం రాకుండా ఎలాంటి తాళాలైనా పగలకొడతారు. వెండి, ఆభరణాలు కాజేస్తారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో గతంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-2 కాలనీల్లో తాళాలు పగలకొట్టి ఇళ్లల్లోకి చొరబడ్డారు. బహుళ అంతస్తుల భవనాలకంటే వ్యక్తిగత ఇళ్లనే ఎంచుకుంటారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

*ఇంటి గేటు, ప్రహరీ దాటి ప్రాంగణంలోకి ప్రవేశించగానే అలారం మోగేలా ఏర్పాటు చేసుకోవాలి.
సీసీ కెమెరాలు బిగించుకుని వాటి పనితీరును పరిశీలిస్తుండాలి.
ఇంటి చూట్టూ, ప్రాంగణంలో పొదలు లేకుండా చూసుకోవాలి.
* కాలనీలోకి కొత్త వ్యక్తులు వస్తే కుక్కలు మొరుగుతాయి. వెంటనే అప్రమత్తమవ్వాలి.
* వీలుంటే కాలనీల సంక్షేమ సంఘాలు చొరవ చూపి గస్తీ నిర్వహించాలి.
* విలువైన వస్తువులు ఇళ్లల్లో కాకుండా బ్యాంకులో భద్రపరుచుకోవాలి.
ఊరెళ్లినా, ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారమివ్వాలి.
*మధ్యాహ్నం ఇళ్లను ఏవరైనా అదేపనిగా చూస్తూ సంచిరిస్తున్నట్లు అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్‌ చేయాలి.
రాత్రి సమయంలో ఏ అనుమానం వచ్చినా చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలి.

పోలీసులకు సహకరించాలి

నేరాల నియంత్రణకు కాలనీలవాసుల భాగస్వామ్యం చాలా అవసరం. చెడ్డీ గ్యాంగ్‌ నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల చూట్టూ ఎవరైనా అనుమానాస్పదంగా సంచిరిస్తున్నట్లు అనిపిస్తే 040-27853952 లేదా 100కి ఫోన్‌ చేయాలి. - లక్ష్మీనారాయణ, కేపీహెచ్‌బీ సీఐ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని