ఉగ్ర ఘాతుకం.. 19 మంది మృతి!

తాజా వార్తలు

Published : 03/11/2020 01:19 IST

ఉగ్ర ఘాతుకం.. 19 మంది మృతి!

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కాబూల్‌లోని ఓ పెద్ద విశ్వవిద్యాలయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇరానియన్‌ బుక్‌ ఫెయర్‌ ప్రారంభం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య గంటల తరబడి కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు గుర్తించారు. బుక్‌ ఫెయిర్‌ ప్రారంభించేందుకు కొందరు అధికారులు వస్తుండగా ఈ కాల్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. కాల్పుల సమయంలో వందలాది మంది యూనివర్సిటీ గేట్లు దూకి పరుగులు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న అఫ్గన్‌ భద్రతా దళాలు రంగంలోకి దిగి యూనివర్సిటీని చుట్టుముట్టి.. రోడ్లు మూసివేసినట్టు పేర్కొన్నారు. 

కాబూల్‌ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అయితే, కాబూల్‌లో కొన్ని విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. గత వారంలో కాబూల్‌లోని ఓ విద్యా సంస్థ వద్ద ఐసిస్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని