Mumbai Rape Case: ‘మహా’రణ్యంలో మరో నిర్భయ.. అత్యాచారం చేసి, ఇనుపరాడ్డుతో కొట్టి!

తాజా వార్తలు

Updated : 11/09/2021 22:22 IST

Mumbai Rape Case: ‘మహా’రణ్యంలో మరో నిర్భయ.. అత్యాచారం చేసి, ఇనుపరాడ్డుతో కొట్టి!

మానవ మృగాల పాశవిక దాడిలో మహిళ మృతి

ముంబయి: మానవ మృగాల పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. ఒంటరిగా ఉన్న 34ఏళ్ల మహిళపై కొందరు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి, బాధితురాలి రహస్య అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. నడిరోడ్డుపైనే రక్తపుమడుగులో కన్పించిన ఆ మహిళ.. చికిత్స పొందుతూ నేడు కన్నుమూసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఉన్న ఘోర ఘటన.. దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం తెల్లవారుజామున ముంబయి పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఓ కాల్‌ వచ్చింది. సాకినాక శివారు ప్రాంతంలోని ఖైరానీ రోడ్డు వద్ద మహిళపై దాడి జరిగిందని సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకునే సరికి ఆ మహిళ రోడ్డుపైనే రక్తపు మడుగులో కన్పించింది. దీంతో వెంటనే ఆమెను ఘాట్కోపర్‌లోని రాజవాడి ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ టెంపో పార్క్‌ చేసి ఉంది. దాన్ని పరిశీలిచంగా.. అందులో రక్తపు మరకలు కన్పించాయి. 

ఆసుపత్రిలో బాధితురాలిని పరీక్షించిన వైద్యులు సంచలన విషయాలను వెల్లడించారు. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు.. ఆమె వ్యక్తిగత అవయవాలపై ఇనుపు రాడ్డుతో దాడి చేసినట్లు చెప్పారు. తీవ్ర రక్తస్రావమైన మహిళ.. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

2012లో దిల్లీలోని ఓ యువతిపై కొందరు మృగాళ్లు ఇలాంటి లైంగిక దాడికే పాల్పడ్డారు. కదులుతున్న బస్సులో ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో ప్రాణాలతో పోరాడుతూ కొద్ది రోజుల తర్వాత ఆ యువతి మరణించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ నిర్భయ ఘటనలో నలుగురు దోషులకు గతేడాది ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని