ఆవో సాయి..
షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా ఉండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు ఉండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్... తదితరులు ఆయన శిష్యగణంలో ఉండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధి నుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్య వ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజన క్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా రోజు వేల మంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిర ప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్, లెండి గార్డెన్స్... తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్యాత్మిక భావన అలముకుంటుంది. సాయి సంస్థాన్ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
|