Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పిన పెను ప్రమాదం

లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు

డ్రైవర్‌ సహా 19 మందికి గాయాలు


నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు ముందు భాగం

వినుకొండ, న్యూస్‌టుడే : పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న లారీ కనిపించక వేగంగా వెళ్లి వెనుక నుంచి ఢీకొట్టడంతో తెలంగాణ ఆర్టీసీ బస్సు ముందు భాగం తుక్కుతుక్కయింది. అందులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలుకాగా డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి కాళ్లు విరిగాయి. వినుకొండ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి డిపోకు చెందిన టీఎస్‌17జడ్‌ 0008 నంబరు గల సూపర్‌ లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు నెల్లూరు జిల్లా వింజమూరు వెళ్లేందుకు వేకువజామున వినుకొండ బస్టాండ్‌ కొచ్చింది. సిబ్బంది టీ తాగి తిరిగి బయల్దేరి సుమారు 5 కి.మీ. వెళ్లగానే ముందు వెళ్తున్న సిమెంట్‌ లోడు లారీని వేగంగా వెళ్లి వెనుక నుంచి ఢీకొట్టడంతో లోపలున్న ప్రయాణికులు ఎగిరి ముందు సీట్లపైన పడ్డారు. ముఖాలు పగిలి రక్తసిక్తమయ్యాయి. అప్పుడు బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారని స్వల్ప గాయంతో బయట పడిన రెండో డ్రైవర్‌ స్వామిగౌడ్‌ తెలిపారు. బస్సు ముందు భాగం లారీ వెనుక ఇరుక్కుపోయి సుమారు 50 అడుగుల దూరం లాక్కుపోయింది. డ్రైవర్‌ పరంధామ స్టీరింగ్‌, సీటుకు మధ్యలో ఇరుక్కుపోవడంతో రహదారిపై వెళ్తున్న లారీల సిబ్బంది ఆగి సుమారు గంట సేపు ప్రయత్నించి రెండు వాహనాలను విడదీశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌తో పాటు ఉదయగిరి మండలం గండిపాలేనికి చెందిన షేక్‌ మహబూబ్‌ జానీకి కాలు విరగ్గా మిగిలిన వారందరికీ గాయాలయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యాధికారి బుచ్చిబాబు తెలిపారు. కామారెడ్డి నుంచి సీఎస్‌పురం దర్గాకు మొక్కు తీర్చుకుందామని తనతో పాటు మరో నలుగురం వెళ్తున్నామని, మార్గమధ్యంలో ఇలా అయిందని ముఖానికి గాయాలైన జైరాబి ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు బోల్తా కొట్టి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదన్నారు.


కాలు విరిగిన డ్రైవర్‌ పరంధామ

గాయాలపాలైన ప్రయాణికులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని