Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డీజీపీతో మాట్లాడేందుకు వెళ్తుంటే అరెస్టులా?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం


సీఐతో మాట్లాడుతున్న సోము వీర్రాజు, ప్రక్కన పాతూరి నాగభూషణం

గ్రామీణమంగళగిరి, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక భాజపా పాత్ర ఉందని డీజీపీ ఆరోపణలు చేశారు. ఈనెల 20 లోగా ఆధారాలతో సహా బయటపెట్టాలని మేము డిమాండ్‌ చేశాం. ఆ విషయంపై డీజీపీని కలిసి మాట్లాడదామని వెళుతుంటే మమ్మల్ని గృహనిర్బంధాలు చేస్తారా? మా పార్టీ నాయకులను అరెస్టులు చేస్తారా..?’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళగిరి రూరల్‌ సీఐని ప్రశ్నించారు. గురువారం మంగళగిరి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో పోలీసులు అరెస్టు చేసిన ఎమ్మెల్సీ మాధవ్‌, మరికొందరు భాజపా నాయకులను రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణంతో కలిసి వీర్రాజు పరామర్శించారు. ఏ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారని అడిగారు. మా విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసినట్లు సీఐ సమాధానం చెప్పారు. డీజీపీతో మాట్లాడేందుకు వెళుతుంటే, మీ విధులకు ఆటంకం ఎలా కలిగిందని వీర్రాజు అడిగారు. సెక్షన్‌ 41 ప్రకారం నోటీసులు ఇచ్చి పంపిస్తామని సీఐ వివరించారు. అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వారి చేతగానితనంగా భావిస్తున్నామన్నారు. మా ప్రశ్నకు సమాధానం చెప్పలేక మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు అర్ధరాత్రిళ్లు గోడలు దూకి వెళ్లి నోటీసులు ఇచ్చారని, గృహనిర్బంధాలు చేశారన్నారు. నేతలను అరెస్టు చేయడం, సంబంధం లేని కేసులు పెట్టడం, సరైన చర్య కాదన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి: ఈ ప్రభుత్వం 30 లక్షల మందికి పంపిణీ చేసిన ఇళ్లపట్టాల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. మంగళగిరి మండలం, చినకాకాని వద్ద ఓ హోటల్‌ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.9 వేల కోట్లతో పేదలకు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారన్నారు. చాలా చోట్ల అధిక ధరలకు భూములు కొనుగోలు చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తోందన్నారు. ఒక ఇంటికి కేంద్రం తరఫున రూ.1.80 లక్షలు ఇచ్చారన్నారు. 15 లక్షల ఇళ్లకు రూ.28 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన చోట్ల రూ.3 వేల కోట్లతో రోడ్లు వేశారన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులు కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్రం అభివృద్ధి చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పుచేసి రత్నాలు ఇస్తున్నారన్నాని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని