Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షేమ గని

ఆపత్కాలంలో ఆదుకొన్న ఖనిజ ఫౌండేషన్‌
ఈనాడు, అమరావతి

గనుల లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీకి అదనంగా 30 శాతం జిల్లా ఖనిజ ఫౌండేషన్‌కు చెల్లించాలి. ఇలా సమకూరిన మొత్తాన్ని మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజల సంక్షేమం కోసం వెచ్చిస్తారు. ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, ఆరోగ్యం, మహిళలు, పిల్లల సంక్షేమం, విద్య, జీవనోపాధి, నైపుణ్యాల అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది.

గతేడాది కరోనా విజృంభణతో వైరస్‌ కట్టడికి అవసరమయ్యే సామగ్రి సమకూర్చుకోవడానికి, పరీక్షలు చేయడానికి తదితర అవసరాల కోసం డీఎంఎఫ్‌ నిధులు వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో రూ.1.68 కోట్ల సొమ్ము కరోనా కట్టడికి వినియోగించారు. గనుల్లో పని చేసే కార్మికులకు అదనపు నైపుణ్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రంథాలయాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇ-లెర్నింగ్‌ వంటి సదుపాయాల కల్పనను చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళికల మేరకు పనులు పట్టాలెక్కలేదు. ఇక్కడి మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ తదితర రంగాల్లో ఆర్థిక సాయం అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచనున్నారు. ఈప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడానికి వీలుగా బిందు, తుంపర సేద్య పరికరాలు అందించాలని నిర్ణయంచారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. డీఎంఎఫ్‌కు గనుల శాఖ ద్వారా నిధుల సమకూరుతుండగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఆయా నియోజకవర్గాల్లో పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు వస్తున్నాయి.

 

తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం

తొలి ప్రాధాన్యంగా ప్రజలందరికీ శుద్ధజలం అందించాలని నిర్ణయించారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సిమెంట్‌ కర్మాగారాలు ఉండటంతో డీఎంఎఫ్‌కు పెద్దఎత్తున సొమ్ము సమకూరుతోంది. ఈ నిధులతో రూ.కోట్లు వెచ్చించి ఆయా నియోజకవర్గాల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా అదనపు తరగతి గదులు, రహదారుల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పన వంటి వాటికి నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభావిత ప్రాంతంలోని ప్రవాహాలు, సరస్సులు, చెరువులు, భూగర్భ జలాలు ఇతర నీటి వనరుల కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కార్మికుల ఆరోగ్యం కోసం బృందబీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని