
మొదలైన పంచాయతీ ఎన్నికల కసరత్తు
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ఆదర్శ నియమావళి (కోడ్) అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ స్పష్టం చేయడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను నిలిపివేశారు. యడ్లపాడు మండలం కొండవీడులో అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు మండలాధికారులు ప్రకటించారు. ఇదే రీతిలో జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల భవనాల నిర్మాణాలు పూర్తయిన చోట్ల.. వాటిని ప్రారంభించడం, నూతన భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొంటుండగా గురువారం నుంచే నిలిపివేశారు. నిరుపేదలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఆదేశించారు. ఎన్నికల కోడ్‌తో పట్టాల పంపిణీ కార్యక్రమాలను ఏం చేయాలనేది అధికారులకు స్పష్టత లేని పరిస్థితి. 23న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్నారు. జిల్లాలో 1,021 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఓటరు జాబితాను ఎస్ఈసీ ప్రకటించింది. తొలి దశలో ఫిబ్రవరి 6, రెండో దశలో 9, మూడో దశలో 13, నాలుగో దశలో 17న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల తేదీకి 12 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. పంచాయతీల ఎన్నికలు పార్టీల రహితంగా జరగనుండటంతో బ్యాలెట్ పత్రాల ముద్రణ జిల్లా యంత్రాంగానికి కత్తి మీద సాములా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎస్ఈసీ ప్రకటించడంతో జిల్లా కలెక్టరు శామ్యూల్ ఆనంద్‌కుమార్, జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్ జిల్లా పంచాయతీ అధికారి కొండయ్యను వివరాలు అడిగారు. జిల్లాలో ఓటర్లు, గ్రామ పంచాయతీల సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల వివరాలను తీసుకున్నారు. శుక్రవారం జిల్లా యంత్రాంగం పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశం కానుంది.