Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగ్రిపై నిఘా..!

ముగ్గురిపై క్రిమినల్‌, పలువురిపై 6ఏ కేసులు

నకిలీ పురుగు మందుల విక్రయాలపై ఉక్కుపాదం


ముట్లూరులో అనుమతులు లేకుండా తయారుచేసిన పురుగు మందుల డబ్బాలు..

ఈనాడు-అమరావతి: జిల్లాలో నకిలీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విక్రయాలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. నకిలీల ఉచ్చులో పడి అమాయక రైతులు చేతులు కాల్చుకుంటున్నారు. గుంటూరు కేంద్రంగానే వ్యవసాయ కమిషనరేట్‌ ఉన్నప్పటికీ నకిలీ పురుగు మందుల విక్రయాలు వెలుగుచూడటంతో కిందిస్థాయి యంత్రాంగంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లా వ్యవసాయశాఖ నుంచి ఎరువులు, పురుగుమందుల విక్రయాలకు లైసెన్సులు పొంది వాటి మాటున కొందరు వ్యాపారులు ప్రమాణాలు లేని మందులు తయారుచేసి పేరున్న కంపెనీల లేబుళ్లు అతికిస్తున్నారు. నిఘావిభాగానికి ఫిర్యాదులు రావడంతో దాడులు మొదలుపెట్టింది. 19న వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్‌ అనే వ్యాపారికి చెందిన మూడు ప్రదేశాల్లో దాడులు చేసి నకిలీ సరకు నిల్వలను స్వాధీనం చేసుకుంది. వ్యాపారితో పాటు అతనికి సహకరించిన మరొకరిపై క్రిమినల్‌ కేసు నమోదుకు విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు.


స్వాధీనం చేసుకున్న నిల్వలతో విజిలెన్స్‌ అధికారులు (పాతచిత్రం)

వ్యవసాయశాఖ యంత్రాంగం పర్యవేక్షణ లోపించిందని, భాద్యులైన అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తామని నిఘా విభాగం పేర్కొంది. ఈ వ్యవసాయ సీజన్‌లో ఇప్పటి వరకు రూ.1.76 కోట్ల విలువైన పురుగుమందులు, రూ.3.50 లక్షల ఎరువులు, 2.42 లక్షల విలువైన విత్తనాలను నిఘా విభాగం జప్తు చేసింది. వట్టిచెరుకూరు, నరసరావుపేట, పెదకూరపాడు స్టేషన్లలో మూడు క్రిమినల్‌ కేసులు నమోదుకు ఫిర్యాదు చేసింది. ఐదు ఫెర్టిలైజర్‌ షాపులు, నకిలీ విత్తనాలు, బయోమందులు విక్రయించిన నలుగురు వ్యాపారులపై 6 ఏ కేసులకు సిఫార్సు చేసింది.

* ముట్లూరులో నకిలీ పురుగు మందులు బయటపడటానికి కొద్ది రోజుల ముందు నరసరావుపేటలో ఇదే తరహాలో ఒక కేసు నమోదుచేసింది నిఘా విభాగం. ఆ షాపులో కూడా వ్యాపారి సొంతంగా నకిలీ మందులు తయారుచేసి విక్రయిస్తున్నారని గుర్తించి రూ.35 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసకుంది.

* గుంటూరు నగరశివారు ఏటుకూరు రోడ్‌లో రూ.1.46 కోట్ల విలువైన నకిలీ మందులు గతేడాది వ్యవసాయ సీజన్‌ ఆరంభంలో స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు, పురుగుమందుల తయారీకి లైసెన్సు పొందిన ఓ వ్యాపార సంస్థ వాటిని అడ్డుపెట్టుకుని నకిలీ మందులు తయారుచేసి కంపెనీ లేబుళ్లు వేసి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించి అప్పట్లో పెద్ద మొత్తంలో సరకు స్వాధీనం చేసుకుంది.

* ప్రభుత్వ రాయితీ ఎరువులు పెదకూరపాడు మండలంలోని 75 త్యాళ్లూరులో ఓ ఎరువుల దుకాణంలోకి చేరాయి. దీనిపైనా నిఘా అధికారులు దాడులు చేయగా అప్పట్లో పెద్ద మొత్తంలో ఎరువులు లభ్యమయ్యాయి.

నమూనాలు ప్రయోగశాలకు

ముట్లూరులో స్వాధీనం చేసుకున్న పురుగుమందుల నమూనాలను నిఘా అధికారులు ప్రయోగశాలకు పంపారు. ఆ మందుల నాణ్యత ఎంత? వాటిల్లో ఏం కలుపుతున్నారు? అవి వినియోగిస్తే పురుగులు ఏమేరకు కట్టడి అవుతాయి? తెగుళ్ల నివారణ సాధ్యమా కాదా అనేది ఆ నివేదికలు రాగానే పరిశీలించి మరిన్ని దాడులు చేయాలనే యోచనలో నిఘావర్గాలు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని