
సుగుణ జాల.. వినుర బాల..
శతకాలు, నీతి కథలతో పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం
విలువల చదువు వైపు భావితరాన్ని నడిపిద్దాం
న్యూస్టుడే, అమరావతి ఫీచర్స్
అప్పుడు..
చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. మైళ్ల దూరం మొనదేలిన రాళ్లపై నడిచి బడికి వెళ్లేవాళ్లు... అయితేనేం నైతిక విలువలు, క్రమశిక్షణ, నీతిని బోధించే వేమన, సుమతీ శతకాలు.. రామాయణం, మహాభారతాల్లోని మంచి మాటలు చెప్పే గురువులకు కొదవ ఉండేది కాదు. దీంతో విద్యార్థుల్లో సంస్కారం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం తొణికిసలాడేది.
ఇప్పుడు..
ప్రపంచం కుగ్రామంగా మారి అర చేతిలోకి వచ్చి చేరింది. విద్యా భ్యాసనకు మార్గం ఎంతో సులుభమైంది. ఇంట్లో నుంచే ఉన్నత విద్య అభ్యసించేందుకు మార్గాలు పెరిగాయి. అయితేనేం మార్కులు, ర్యాంకుల పరుగు పందెంలో నీతి, నిజాయతీ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం కొరవడుతోంది.
జీవితంలో గమ్యం వైపు ఎలా పయనం సాగించాలి.. అయోమయం.. ఆందోళన. సంకటస్థితి ఎదురైనప్పుడు తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో ఎలా బయటపడాలి.. ఎంతటి కష్టాన్నైనా అవలీలగా ఎలా అధిగమించాలో తెలియని పరిస్థితిలో నేటితరం విద్యార్థులు ఉంటున్నారు. బాల్య దశలోనే వేమన, సుమతీ శతకాలు, నీతి కథలను పిల్లలకు తెలియజేస్తే ప్రతి దశలోనూ అవి వారికి ఎంతో ఉపకరిస్తాయి. రాబోయేతరం కూడా సన్మార్గంలో పయనించేలా దోహదం చేస్తాయి. అలా చేసేందుకు పెద్దగా కష్టపడక్కర్లేదు. డబ్బులు, ఖర్చు చేయక్కర్లేదు. కాస్తంత సమయం పిల్లలతో గడుపుతూ వారికి ఆ శతకాల్ని బోధిస్తూ అందులోని నీతిని తెలియజేస్తేచాలు.
సత్తెనపల్లి పట్టణంలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థి తండ్రిని బెదిరించి డబ్బు రాబట్టేందుకు తాను కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడు. రూ.10లక్షల నగదు డిమాండ్ చేసి చివరకు రూ.10వేలు తీసుకోబోయి పట్టుబడ్డాడు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇలా తల్లిదండ్రుల్ని డబ్బు కోసం బెదిరించే.. మోసం చేసే కుమారుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది.
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ
భావం : తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను, చచ్చినను ఒకటే. పుట్టలో పుట్టి ఎవరికీ ఉపయోగం లేక ఆ పుట్టలోనే చేనిపోయే చెద పురుగుల లాగే తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడి జన్మం వ్యర్థం కదా.
నీతి: ఇలాంటి పద్యాలు చిన్నతనంలోనే పిల్లల మనసులో నాటుకునేలా చేస్తే సన్మార్గంలో నడుస్తారు.
విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గంజాయి, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. దీనికి కారణం ఆరా తీస్తే అతడు చెడు స్నేహాలతో పాడైపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రతిభావంతులైన ఎంతో మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు చెడు స్నేహాలతో దారి తప్పుతున్నారు.
వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును
జీడపురుగు చేరి చెట్టు చెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వధాభిరామ వినురవేమ!
తాత్పర్యం: వేరుపురుగు వేరును తొలిచి చెట్టును పాడు చేస్తుంది. అదే విధంగా చీడ పురుగు చెట్లపైకి చేరి వాటిని పాడు చేస్తుంది. కీడుజేసేవాడు గుణవంతుణ్ని కూడా చెడగొడతాడు.
నీతి: యుక్త వయసులో విద్యార్థులకు ఈ పద్యం గుర్తుకొస్తే చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంసెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులువచ్చాయని, తండ్రి మందలించాడనినరసరావుపేటకు చెందిన విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఇంజినీరింగ్ విద్యనభ్యసించినా ఉద్యోగం రావట్లేదని విజయవాడ నగర శివారు ప్రాంతాలకు చెందిన ఇద్దరు భావి ఇంజినీర్లు బలవన్మరణం చెందారు. ప్రేమ.. ఆకర్షణల ప్రభావం.. పరీక్షల్లో అనుత్తీర్ణత.. ఉద్యోగం, ఉపాధి లేదని రేపటి పౌరులు.. దేశానికి విలువైన సంపదగా ఉన్న యువత ఆత్మహత్యల బాట పడుతున్నారు.
శ్రద్ధ లేనియెడల చదువు సాములు రావు
శ్రద్ధయున్న రాని చదువు లేదు.
శ్రద్ధ కలిగినేని చంద్రమండల యాత్ర
సులభసాధ్యమె యగు తెలుగుబిడ్ఢ
భావం : ఓ తెలుగు బిడ్డా! శ్రద్ధ లేకపోతే చదువు సంధ్యలు రావు. శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించవచ్ఛు చంద్ర మండలాన్ని కూడా చేరుకోవచ్ఛు శ్రద్ధే అన్నిటికీ మూలం.
నీతి: కృషి చేస్తే విజయం అదే వరిస్తుందనే నీతిని దీనిని నుంచి తీసుకోవచ్ఛు చనిపోయి సాధించేది ఏదీ లేదని, కష్టపడి ప్రయత్నిస్తే ఎంతటి లక్ష్యాన్నయినా చేరుకోవచ్ఛు
సినిమాలోని ప్రతినాయకుడి పాత్రతో ప్రేరణ పొంది సత్తెనపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు రాత్రిపూట ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలకు నిప్పుపెట్టి ఆ మంటలతో ఆనందం పొందుతున్నాడు. లారీకి నిప్పు పెట్టబోయిన అతడిని పోలీసులు పట్టుకుని విచారిస్తే చిన్నప్పటి నుంచే అతను చదువుకు దూరమవ్వడంతో హింసా ప్రవృత్తిని అలవర్చుకున్నాడని తేలింది.
చదువని వాడజ్ఞుండగు,
చదివిన సదసద్వివేక చతురత కలుగున్,
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ!
భావం : చదవని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా! చదువుకో! అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో అంటాడు.
నీతి: పోతన రాసిన ఈ పద్యం చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఎరుక గలవారి చరితలు
గరచుచు సజ్జనుల గోష్ఠి గడలక ధర్మం
బెరుగుచు నెరగిన దానిని
మరువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్.
భావం : జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి. మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరువకుండా మంచి బుద్ధితో ఆచరించాలి.
నీతి: పుస్తక పఠనం ద్వారా ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగవచ్చో నన్నయ పద్యం ద్వారా తెలుసుకోవచ్ఛు