Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధ్యాపకుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా?


చేయి చేయి కలిపి సంఘీభావం తెలుపుతున్న ఎమ్మెల్సీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘాల జేఏసీ సభ్యులు

అలంకార్‌కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ ఎమ్మెల్సీలు కె.లక్ష్మణరావు, రఘువర్మ, ఏఎస్‌ రామకృష్ణలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం నగరంలోని ధర్నాచౌక్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అధ్యాపకులు ఇబ్బందులు పడుతుంటే కళాశాల విద్యా శాఖకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీలను వెంటనే చేపట్టాలని, యూజీసీ-2016 బకాయిలను వెంటనే విడుదలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంటెక్‌ తదితర వాటికి అదనపు ఇంక్రిమెంట్‌లను వెంటనే విడుదలు చేయాలని కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల్ని అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌, అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌, ఫ్రొఫెసర్‌లుగా పిలుస్తారని, ఆ హాదాల్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. అందుకనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసినా కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 2015-16 నుంచి సెమిస్టర్‌ విధానం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి పని దినాలు పెరిగాయని ఎమ్మెల్సీలు చెప్పారు. అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘాల జేఏసీ కమిటీ సభ్యులు కె.భాస్కరరావు, ఏఆర్‌ చంద్రశేఖర్‌, డా.పి.వేణుగోపాల్‌, డా.వి.కోటేశ్వరరావు, బి.రాజగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకుల ధర్నాకు ఏపీ జేఏసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ సుధీర్‌బాబు మద్దతు ప్రకటించి ప్రభుత్వం అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని