
‘హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు’

మైలవరంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు
మైలవరం, న్యూస్‌టుడే: పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అకారణంగా తెదేపా సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు వంటి సౌమ్యుడిని అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్ట్ చేసి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంత పాలన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కళా అరెస్ట్‌కు నిరసనగా గురువారం మైలవరంలో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానికి తాను సవాల్ విసిరి... చెప్పిన సమయానికి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లానని, చేతగానితనంతో అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట ప్రభుత్వం చెప్పిన మాటలు అవాస్తవాలని కోర్టు తీర్పిచ్చిందని వివరించారు. మైలవరంలోని పూరగుట్టలో లబ్ధిదారులకు సెంటున్నరే స్థలం ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. నాయకులు పోతురాజు, శోభన్‌బాబు, లీలాప్రసాద్, సుబ్బారావు, బుల్లిబాబు, బాలకృష్ణ, రేణుక, వెంకటనారాయణ, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.
గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పార్టీ పరంగా స్వాగతిస్తున్నామని, ఇది ప్రభుత్వానికి చెంపదెబ్బని బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కళా వెంకటరావును రాత్రి వేళ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు దుర్మార్గమన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా బస్టాండ్ సెంటర్లో ఎంఎన్కే రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పోలీసు వ్యవస్థ
అవనిగడ్డ, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకటరావును అరెస్టు చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ మరోసారి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కళా వెంకటరావును అరెస్టు చేసిన తీరు పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను మసకబార్చిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దగ్గర నుంచి అవనిగడ్డలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య వరకు దోషులను పట్టుకోని కేసులు అనేకం ఉన్నాయన్నారు. వాటిని చేధిస్తే పోలీసులపై ప్రజలకు నమ్మకం కుదురుతుందన్నారు.