
సరైన పత్రాలు లేని రూ.50 లక్షల నగదు స్వాధీనం
సొమ్ము తీసుకెళ్తున్న వ్యక్తి ఓ టీవీ ఛానల్ విలేకరి
కంచికచర్ల, న్యూస్‌టుడే: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును కంచికచర్ల పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నందిగామ గ్రామీణ సీఐ కె.సతీష్ వెల్లడించిన వివరాల ప్రకారం.... విశాఖపట్నంలోని గాంధీనగర్ మండలం చోడవరానికి చెందిన అదారి నాగ వెంకట సూర్యనారాయణ పెందుర్తి మండలానికి ఓ ఎలక్ట్రానిక్ ఛానల్ (ఈటీవీ కాదు) విలేకరిగా పని చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో రెండు సంచుల్లో నగదు తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. దొనబండ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో బస్సులో నగదును పోలీసులు గుర్తించి నగదు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా ప్రకటనల ద్వారా వచ్చిన సొమ్ము హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అదే ఛానల్‌కు చెందిన బ్యూరో ఇన్‌ఛార్జి కోనేరు క్రాంతికుమార్ తనతో పాటు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకూ వచ్చారని, నగదును బస్సులో హైదరాబాద్ తీసుకెళ్లాలని, తాను కారులో వచ్చి హైదరాబాద్‌లో సొమ్ము తీసుకుంటానని చెప్పినట్లు వివరించారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోగా... పొంతన లేని సమాధానాలు చెప్పడంతో సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించారు. ఎస్సైలు ఎస్.రంగనాథ్, లక్ష్మి పాల్గొన్నారు.