
చరమాంకంలో ఉపాధ్యాయ బదిలీలు
30లోగా అప్పీళ్ల స్వీకరణకు అవకాశం
ముదినేపల్లి, పటమట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఈనెల 16న దాదాపుగా పూర్తవగా, గ్రేడ్-2 హెచ్ఎంలు, పండితుల విషయంలో హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. పూర్తి ఖాళీలు బదిలీల్లో చూపించాలని పండిట్లు, విద్యాసంవత్సరం గురించి గ్రేడు-2 హెచ్ఎంలు కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో ప్రక్రియ ఆగిపోయింది. నిలిచిపోయిన షెడ్యూల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని 892 పోస్టులకు ఈ నెల 26లోపు ఉపాధ్యాయులు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. అన్ని కేడర్లలో ఐదువేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా.. అభ్యర్థన బదిలీలు వందల్లో మాత్రమే జరిగాయి. ఉత్తర్వుల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవటంతో ఎందుకొచ్చిన తంటా అంటూ మెజారిటీ ఉపాధ్యాయులు కేవలం 3 నుంచి 10లోపు ప్రదేశాలు పెట్టుకుని తమ పాఠశాలను తిరిగి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. గతంతో పోల్చితే తక్కువగానే అభ్యర్థన బదిలీలు జరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు.
అప్పీళ్ల స్వీకరణ : ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు బదిలీల్లో అభ్యంతరాలపై డీఈవో కార్యాలయాల్లో అప్పీళ్లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 2, 3 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. స్పౌజ్ కేటగిరీలోని ఉపాధ్యాయులు ప్రాధాన్యత పాయింట్లు పొందినా.. అందుకు విరుద్ధంగా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకొని బదిలీ అయితే సరైన ఆధారాలతో వాటిని అధికారుల దృష్టికి తీసుకొని రావచ్ఛు సీనియారిటీ, వివిధ కేటగిరీల కింద ప్రాధాన్య క్రమంలో పొందిన పాయింట్ల ఆధారంగా తాము కోరుకున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లినవారు కూడా అప్పీల్ చేసుకోవచ్ఛు హేతుబద్ధీకరణలో అన్యాయం జరిగిందని భావించినా, లేదా అర్హత లేనివారికి అర్బన్ ప్రాంతాలకు దగ్గరగా పాఠశాలలు కేటాయించారనే సమాచారమున్నా తగిన ధ్రువపత్రాలతో అప్పీల్ చేసుకోవచ్ఛు
ఎన్నికల నియమావళి వస్తే.. ఎన్నికల ప్రక్రియపై ముందుకు సాగాలని హైకోర్టు పేర్కొనడంతో బదిలీలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. కోర్టు స్టేలు, ఎన్నికల కోడ్‌తో ఈసారి బదిలీల ప్రక్రియ ఉపాధ్యాయుల సర్వీస్‌లో మరిచిపోలేనిదని నిపుణులు పేర్కొంటున్నారు.