
ఓడరేవు నిర్మాణానికి త్వరితగతిన భూసేకరణ
ప్రజలకు నచ్చచెప్పేందుకు గ్రామసభల నిర్వహణ
సమీక్షలో మంత్రి పేర్ని నాని

సమీక్షిస్తున్న మంత్రి నాని, పాల్గొన్న కలెక్టరు ఇంతియాజ్ తదితరులు
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే: బందరు ఓడ రేవు, మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (ముడా) తదితరాలపై విజయవాడలోని కలెక్టరు విడిది కార్యాలయంలో, రాష్ట్ర రవాణా, సమాచార.. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓడ రేవు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏపీ మారిటం బోర్డు ఆదేశాల మేరకు ఓడ రేవుకు అవసరమైన 3,400 ఎకరాలను మూడు దశల్లో సేకరించాల్సి ఉందన్నారు. తొలి దశలో 2,350 ఎకరాల సేకరణ లక్ష్యంగా ఉండగా, 1428 ఎకరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఇంకా 922 ఎకరాలను ముడాకు అప్పగించాల్సి ఉందన్నారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ.. 533 ఎకరాల భూసేకరణ కోసం రూ.133 కోట్లు అవసరం అవుతాయని వివరించారు. మంత్రి స్పందిస్తూ.. మంగినపూడి, గోపువానిపాలెం, కరఅగ్రహారం గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి ప్రజలకు నచ్చ చెప్పాలని అధికారులకు సూచించారు. ఇదివరకే సేకరించి ఓడ రేవుకు ఇచ్చిన 1730 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుభవదారుని పేరు పొందు పర్చలేదన్నారు.
‘ముడా’లో అవసరం లేని సిబ్బంది తిరుగు టపా
ముడా ప్రగతిపై వైస్ ఛైర్మన్ నారాయణరెడ్డి మంత్రికి నివేదించారు. 140 భవనాల కోసం అర్జీలు రాగా వీటిలో 110 భవనాలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. లేఅవుట్లు, 327 భవనాలు అక్రమంగా ఉన్నాయని, వీటిపై డెవలప్మెంటు ఛార్జీల వసూలు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఓడ రేవుకు సంబంధించి రాయల్ కన్సల్టెన్సీ ద్వారా త్వరగా బృహత్ ప్రణాళిక రూపొందించేలా చూడాలన్నారు. వెబ్‌ల్యాండ్‌లో పట్టాదారుల వివరాలను సరి చూసుకోవాలన్నారు. కార్యాలయ నిర్వహణపై కఠినంగా వ్యవహరించాలని వైస్ ఛైర్మన్‌కు సూచించారు. అవసరం లేని సిబ్బందిని తిరిగి వారి కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు. పొరుగు సేవల సిబ్బందిని అవసరం మేరకే వినియోగించుకోవాలన్నారు. సమీక్షలో కలెక్టర్ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పాల్గొన్నారు.