
నరకం కనిపించింది..

వారధి వైపు నుంచి వచ్చి బెంజిసర్కిల్ వద్ద ఆగిపోయి...
విజయవాడ సిటీ, పటమట న్యూస్‌టుడే: ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడలో గురువారం ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లతో నరకం చూశారు. బెంజిసర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వాహనాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పోలీసులు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆ ప్రాంతానికి ఎవరినీ అనుమతించలేదు. నగరం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అనుసంధనం చేసే కూడలి కావడంతో బెంజిసర్కిల్ వద్ద అనునిత్యం రద్దీగా ఉంటుంది. ఇటు వైపు వాహనాలు రాకుండా అధికారులు ఎక్కడికక్కడ మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. నగరానికి వివిధ పనులు నిమిత్తం వచ్చిన ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసులతో ప్రయాణికుల వాగ్వాదం
ఎక్కడికక్కడ ఆగిపోయి...
మచిలీపట్నం వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా వెళ్లే కార్లు, బస్‌లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడ నుంచి కృష్ణవేణి రోడ్డు మీదుగా రామలింగేశ్వరనగర్ మీదుగా కృష్ణలంక వైపు హైవేకు పంపించారు. అత్యధిక సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జాం అయింది. ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలోకి వెళ్లే వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నిర్మలా కాన్వెంట్ రోడ్డు, రమేష్ ఆసుపత్రి, రామవరప్పాడు రోడ్డు మీదుగా అనుమతించారు. మరికొన్ని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా ఐదో నెంబర్ రూట్లో వెళ్లాయి. ఇక్కడ భూగర్భ విద్యుత్తు లైన్లు వేసే గుంతలు తవ్వారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కిలోమీటర్ల మేర దూరం వాహనాలు నిలిచిపోయాయి. ఇదే ప్రాంతంలో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు ఉండటంతో రాకపోకలకు అసౌకర్యం కలిగింది. రామవరప్పాడు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పంపించినా మొత్తం జాం అయిపోయింది. దీంతో అటు ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకూ వాహనాలు ఆగిపోయాయి.
అనుసంధాన రోడ్లు మూసివేతతో ఇక్కట్లు
ఎంజీరోడ్డులోకి ఒక్కసారిగా వచ్చిన వాహనాలు
ఎంజీరోడ్డులోకి వచ్చే అనుసంధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. కృష్ణలంక హైవే మీద నుంచి పశువుల ఆస్పత్రి, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఐదో నెంబర్ రూట్, శిఖామణి కూడలి, టిక్కిల్ రోడ్డు, పీవీపీ మాల్, రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎవరినీ రానివ్వకుండా పోలీసు బలగాలను కాపలాగా పెట్టారు. వివిధ దుకాణాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు. సమయం దాటిపోతుందని తమను పంపించాలని వేడుకున్నా పట్టించుకోకపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉయ్యూరు వైపు నుంచే బస్సులను ఎన్టీఆర్ సర్కిల్ వద్దే ఆపేయడంతో విద్యార్థులు ఎంజీరోడ్డులో కళాశాలలకు నడుచుకుంటూ వెళ్లారు. ముఖ్యమంత్రి రేషన్ వాహనాలను ప్రారంభించి వెళ్లే వరకు ఆ ప్రాంతం మొత్తం పోలీసుల పహారాలో ఉండిపోయింది. వివిధ అవసరాల నిమిత్తం బయటకు కూడా వెళ్లనివ్వలేదని స్థానికులు వాపోయారు.