Published : 03/12/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దోపిడీ దొంగల హల్‌చల్‌

తిరుపతి(నేరవిభాగం): తిరుపతిలో దోపిడీ దొంగలు వీరంగం చేశారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి యజమానిని మారణాయుధాలతో బెదిరించి 420 గ్రాముల బంగారు నగలు, రూ.1.65 లక్షల నగదు దోపిడీ చేేశారు. సమాచారం అందుకున్న క్రైం ఇన్‌ఛార్జి అదనపు ఎస్పీ మునిరామయ్య, శాంతిభద్రతల అదనపు ఎస్పీ ఆరిఫుల్లా, క్రైం డీఎస్పీ మురళీధర్‌, తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలిపిరి పీఎస్‌ ఎస్‌ఐ షేక్‌షావల్లీ కథనం మేరకు.. ‘తిరుపతి-కరకంబాడి రోడ్డులోని బ్యాంకు ఎంప్లాయీస్‌ కాలనీలో శివశంకర్‌ ఫర్నిచర్‌ షాపు నడుపుతున్నారు. భార్య, కుమారుడు కొన్నిరోజుల ముందు ఊరికి వెళ్లారు. ఒంటరిగా ఉంటున్న శివశంకర్‌ మంగళవారం రాత్రి దుకాణం మూసివేసి నాలుగో అంతస్తులోని ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి లిఫ్టులో నాలుగో అంతస్తు చేరుకున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా పగులగొట్టారు. గ్రిల్‌ లేకుండా అమర్చిన అద్దాలను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అద్దం పగిలిన శబ్దానికి శివశంకర్‌ హాల్‌లోకి వచ్చాడు. ఇంటి యజమానిని మారణాయుధాలతో బెదిరించారు. బీరువా లాకర్‌ పగులగొట్టి అందులో ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. పడకగదిలో బంధించి పరారయ్యారు. తెల్లవారిన తర్వాత శివశంకర్‌ కిటికి వద్దకు వచ్చి అరుస్తుండగా పక్క భవనంలో ఉన్నవారు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. వారు అలిపిరి పోలీసులను అప్రమత్తం చేయడంతో అక్కడికి చేరుకుని తలుపులు తెరిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని