Published : 03/12/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాల ఉత్పత్తులకు ప్రోత్సాహం

● పైలెట్‌ ప్రాజెక్టు కింద పాలసేకరణ ప్రారంభం

● వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో సీఎం ముఖాముఖి

ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ భరత్‌గుప్తా, జేసీ (అభివృద్ధి)

వీరబ్రహ్మం, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి, శిక్షణ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తదితరులు

మదనపల్లె (పట్టణం-గ్రామీణ), న్యూస్‌టుడే: ‘వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం గ్రామీణ ప్రజలకు సరిపోవడంలేదు. పాల ఉత్పత్తులను ప్రోత్సహించి రైతు ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా పెట్టుకున్నాం’అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మదనపల్లె మండలం వేంపల్లెలో ఏపీ- అమూల్‌ ఆధ్వర్యంలో ఆటోమేటెడ్‌ పాలసేకరణ, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్లను బుధవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి మాట్లాడారు.అమూల్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద 400 గ్రామాల్లో సహకార సంఘాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే పాలలో ఎస్‌ఎన్‌ఎఫ్‌ 8.3 శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి పాలను అమూల్‌ ప్రతినిధులు అంగీకరించడంలేదు. ఈ కారణంతోనే పాలను ప్రైవేటు డెయిరీలకు రైతులు విక్రయిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాల’ని వేంపల్లెకు చెందిన మహిళా రైతు రాజేశ్వరి సీఎంకు విన్నవించారు. స్పందించిన ఆయన పక్కనే ఉన్న అమూల్‌ ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా మాట్లాడారు.

పాడిఆవుల పంపిణీ..

జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం మాట్లాడుతూ జిల్లాలో 10,800 మందికి పాడిఆవుల పంపిణీ చేయడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టు కింద మదనపల్లె, రామసముద్రం మండలాల్లోని 32 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 1,035 మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి, శిక్షణ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, పశుసంవర్ధశాఖ జేడీ వెంకట్రావు లబ్ధిదారులకు పాడి ఆవులను పంపిణీ చేశారు. ఎంపీడీవో లీలామాధవి, ఏడీ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దారు కుప్పుస్వామి, పాలడెయిరీ మేనేజరు నవీన్‌, వ్యవసాయశాఖ ఏడీ శివశంకర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని