
నగరంలోని మిఠాయిదుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న
ఆహార భద్రత, నియంత్రణాధికారులు
తిరుపతి(నగరపాలిక): విడిగా అమ్మే తీపి పదార్థాలపై గడువు తేదీని తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా ఆహార భద్రత, కల్తీ నియంత్రణ అధికారి జి.ప్రభాకరరావు స్పష్టం చేశారు. తిరుపతిలోని స్వీట్షాపులు, బేకరీలపై బుధవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ షమీంబాషా, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ప్యాకింగ్ చేసిన తీపి పదార్థాలపై తయారీ, గడువు తేదీని ముద్రించే వారని, ఇక విడిగా ట్రేలు, పాత్రలలో పెట్టి విక్రయించే వాటిపై తేదీ వేసి ప్రదర్శించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ నిబంధనను 2020 అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ నిబంధనను పాటించని 5 ప్రముఖ దుకాణాలకు తాఖీదులు జారీ చేశారు. నగరవ్యాప్తంగా పలు దుకాణాలను పరిశీలించగా అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తీపి పదార్థాలు తయారు చేస్తున్నారని, గడువు తేదీలు లేకపోవడంతో పాటు అపరిశుభ్రమైన వాతావరణంలో విక్రయిస్తున్నారని తెలిపారు. తొలి హెచ్చరికగా తాఖీదులు ఇస్తున్నామని జిల్లా ఆహార భద్రత, కల్తీ నియంత్రణ అధికారి ప్రభాకర్ స్పష్టం చేశారు.