
టీచర్ల బదిలీ పాయింట్లను పరిశీలించాలి
విద్యాశాఖ సిబ్బందితో మాట్లాడుతున్న ఏడీ పురుషోత్తం
చిత్తూరు విద్య: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన పాయింట్లు సక్రమంగా ఉన్నాయో లేదా పరిశీలించాలని విద్యాశాఖ ఏడీ పురుషోత్తం తెలిపారు. స్థానిక డీఈవో కార్యాలయంలో బుధవారం బదిలీ దరఖాస్తులోని పాయింట్లను ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి.. కార్యాలయ సిబ్బందికి వివరించేందుకు సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా ఒకే పాఠశాలలో పనిచేసిన టీచర్లు, ఐదేళ్లు ఒకచోట సర్వీసు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయుల దరఖాస్తులను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ పరిశీలన నిష్పక్షపాతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. పరిశీలనలో తేడా ఉన్నవాటిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి మండలాల వారీగా బదిలీ దరఖాస్తులను కేటాయించారు. సమావేశంలో కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.