
గోపూజతో సకల దేవతల పూజా ఫలితం
గోశాలను పరిశీలిస్తున్న పీఠాధిపతి, ఈవో తదితరులు
తిరుపతి(తితిదే): గోపూజ చేయడం ద్వారా సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని, గోవు మానవుల వ్యవసాయ అవసరాలకు, ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు. అలిపిరి పాదాల మండపం సమీపంలో తితిదే ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శేఖర్‌రెడ్డి సహకారంతో నిర్మిస్తున్న సప్త గో ప్రదక్షిణ మందిర ఏర్పాట్లను బుధవారం పీఠాధిపతి పరిశీలించారు. శ్రీకృష్ణస్వామి విగ్రహానికి పూజలు చేశారు. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, తితిదే ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శేఖర్‌రెడ్డి, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, సీఈ రమేష్‌రెడ్డి, ఎస్వీ గోసంరక్షణ శాఖ సంచాలకుల హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● చంద్రగిరి: తొండవాడ సమీపంలోని సంప్రదాయ సాంస్కృతిక పాఠశాలను శ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి సందర్శించారు.
పనుల్లో నిర్లక్ష్యం తగదు
తిరుపతి(నగరపాలిక): తిరుపతిలో స్మార్ట్‌సిటి పథకంలో భాగంగా జరుతున్న భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటు పనుల్లో నిర్లక్ష్యం తగదని నగరపాలిక కమిషనర్ పి.ఎస్.గిరీష అధికారులను ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి ఆయన నగరంలో భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటు పనులను పరిశీలించారు. అన్నారావు కూడలి, ఇస్కాన్ మార్గం, రూయా, శ్రీనివాసం, తిరుమల బైపాస్ రోడ్డు, ఎల్ఐసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో తీగల కోసం తీసిన గోతుల వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఆయన గమనించి నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.