
రాయితీగోవిందా..!
● 800 బిందుసేద్యం దరఖాస్తులు రద్దు
● నిరాశలో రైతులు
న్యూస్టుడే, చిత్తూరు(వ్యవసాయం): బిందు, తుంపర్ల సేద్యం దరఖాస్తులను రద్దు చేశారు.. రాయితీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది.. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో ముగియనుంది.. నేటికీ ఒక్క ఎకరాకు బిందు సేద్యం రాయితీ మంజూరు చేయనేలేదు.. ఈ తరుణంలోనే 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి 800 బిందు సేద్యం దరఖాస్తులు రద్దు చేశారు.. రైతు వాటాగా చెల్లించిన నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు జిల్లా సూక్ష్మనీటిసాగు పథకం అధికారులు కసరత్తు ప్రారంభించారు.. దీంతో సుమారు రెండు వేల ఎకరాలకు సూక్ష్మసేద్యం దూరమైంది.. ఆశించిన లక్ష్యాన్ని చేరకనే బిందుసేద్యం పరిస్థితి దయనీయంగా మారింది.
*జిల్లాలో పశ్చిమ ప్రాంతం సహా చాలాచోట్ల బిందుసేద్యాన్ని అన్నదాతలు అనుసరిస్తున్నారు. కష్టమైనా.. నష్టమైనా ఈ విధానానికి అలవాటుపడి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా బిందు సేద్యం పరికరాల కోసం కళ్లు కాయలు కాచేలా నిరీక్షించిన వారికి చివరకు కష్టమే మిగిలింది. బిందు సేద్యం పరికరాలు సహా రాయతీ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చివరకు మొండిచేయి మిగిలింది. దీంతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన 1200 దరఖాస్తుల రద్దుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డ్రిప్ కంపెనీలు రైతులకు అందజేయాల్సిన పరికరాలను సరఫరా చేయలేదు. దీంతో ఆయా దరఖాస్తులను రద్దు చేసి డీడీ సొమ్మును వెనక్కి ఇస్తున్నామని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బకాయిల వల్లే..
ప్రభుత్వం డ్రిప్ కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.2 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. తదనుగుణంగా జిల్లాలో సుమారు రూ.220 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు పేరుకుపోవడం, డ్రిప్ పరికరాల ముడిసరకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో పరికరాల సరఫరాకు కంపెనీలు ఆసక్తిగా ముందుకు రాలేదు. పెండింగ్ లబ్ధిదారులు సహా నూతన లబ్ధిదారులకు పరికరాలు సరఫరా చేయలేమని కంపెనీలు చేతులెత్తేశాయి. ఈ పరిస్థితుల్లో బిందు సేద్యం లక్ష్యాలు నీరుగారాయి. భవిష్యత్లో రైతులకు బిందు, తుంపర్ల సేద్యం రాయితీలు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.