Published : 03/12/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పౌరసరఫరాల సంస్థలోముగ్గురి తొలగింపు

బియ్యం అక్రమ రవాణానే కారణం

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: పౌరసరఫరాల సంస్థలో ముగ్గురు ఒప్పంద ఉద్యోగులపై వేటు పడింది. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన వీరిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీడీనెల్లూరులోని పౌరసరఫరాల సంస్థ గోదాము నుంచి గతనెల 22న రాత్రి 400 బస్తాల(20 టన్నులు)బియ్యాన్ని లారీలో అక్రమంగా నగిరికి తరలిస్తుండగా.. తిరుపతి విజిలెన్స్‌ అధికారులు పట్టుకొని అధికారులు విచారించారు. ఈ ఘటనపై జీడీనెల్లూరు గోదాం డీటీ(రెవెన్యూ అధికారి) మహేష్‌, నగరి గోదాంలో పనిచేస్తున్న అటెండరు గంగధరానికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అధికారులు వీరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. చిత్తూరు తాలూకా సీఐ బాలయ్య ఈ కేసును లోతుగా విచారించగా పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న జిల్లా పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ గోపి, శ్రీకాళహస్తికి చెందిన రైస్‌మిల్‌ యజమాని బాబు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఈ నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి రిమాండ్‌ విధించింది. పౌరసరఫరాల సంస్థ అధికారులు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిసారించి విచారించి రవాణాకు సహకరించిన జీడీనెల్లూరు గోదాం అటెండరు జనార్దన్‌రెడ్డి సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌ గోపి, నగరి గోదాం అటెండరు గంగాధరాన్ని(ముగ్గురూ ఔట్‌సోర్సింగ్‌) ఉద్యోగం నుంచి తొలగించారు.

క్షుణ్ణంగా దస్త్రాల తనిఖీ..

పౌరసరఫరాల సంస్థ అధికారులు జిల్లాకు బియ్యం దిగుమతి, మండల నిల్వ కేంద్రాల(గోదాం) సరఫరా దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సంస్థ జిల్లా కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్‌ గోపి పరిధిలోనే బియ్యం సరఫరా, కేటాయింపుల రికార్డుల నిర్వహణ ఉంది. ఏడాదిలో రికార్డుల నిర్వహణపై క్షుణ్ణంగా తనిఖీలు ప్రారంభించారు. పలు రికార్డుల్లో సంబంధిత అధికారుల సంతకాలు లేకుండానే ఆమోదించినట్లు తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని