Published : 03/12/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆధార సవరణం

మీ సేవ కేంద్రాల్లో.. నిలిచిన ఆధార్‌ సేవలు

ప్రభుత్వ స్థలంలో కార్యకలాపాలు నిర్వర్తించాలని ఆదేశాలు 

58 మంది ముందుకొచ్చినా.. స్థలాలు కేటాయించని వైనం  

ఆధార్‌ కార్డుల్లో సవరణలకు మీ సేవ కేంద్రంలో వేచి ఉన్న ప్రజలు (పాతచిత్రం) 

రేషన్‌ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టా పొందాలన్నా.. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు వర్తించాలన్నా పౌరులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. గతంలో జారీ చేసిన కార్డుల్లో తప్పులుంటే.. వాటిని సవరించుకోవడానికి ప్రజలు మీ సేవ కేంద్రాలకు వెళుతున్నారు. ఇదే తరుణంలో  తల్లిదండ్రులు చిన్నారులకు కొత్తగా ఆధార్‌ నమోదు  చేయిస్తున్నారు. ఇటీవల వీటి సేవలు అందించే మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ స్థలంలో కార్యకలాపాలు నిర్వహించాలనే ఆదేశాలు వచ్చాయి. ఇందుకుతగ్గట్టు అధికారులు స్థలం చూపించకపోవడంతో ఆయా కేంద్రాల్లో గతనెల రెండో వారం నుంచి సేవలు నిలిచి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. 
ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్‌టుడే, తిరుపతి(గ్రామీణ): జిల్లావ్యాప్తంగా 550 మీ సేవ కేంద్రాలుండగా.. వీటిలో 170 చోట్ల ఇటీవల వరకు ఆధార్‌ సేవలందించారు. వీటికితోడు తపాల కార్యాలయాలు, పలు బ్యాంకుల్లో కొత్తగా ఆధార్‌ నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఎక్కువ మంది పౌరులు మీ సేవ కేంద్రాలనే ఆశ్రయించే పరిస్థితి ఉంది. 2009లో కొత్తగా ఆధార్‌ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కొందరి వివరాలు సక్రమంగా నమోదు లేదు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వంటివి తప్పుగా నమోదు అయ్యాయి. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి అని ప్రకటించలేదు. కొన్నేళ్ల నుంచి ఆధార్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రజలు తప్పులను సవరించుకోవడానికి మీ సేవ కేంద్రాల బాట పట్టారు. ఇందుకు నిర్వాహకులు నిర్ణీత రుసుం వసూలు చేసేవారు. మరికొందరు బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు వెళ్లి సేవలు పొందుతున్నారు. 
స్థలం కేటాయించక..
కొన్ని ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాల్లోని సిబ్బంది ఆధార్‌ మార్పుల్లో అవకతవకలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వ స్థలాల్లోనే సేవలు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. ఈ నేపథ్యంలో 58 మంది నిర్వాహకులు సర్కారు సూచించిన ప్రాంతంలో సేవలు అందిస్తామంటూ ముందుకు వచ్చినా ఇప్పటివరకూ వారికి స్థలం చూపించలేదు. దీంతో పౌరులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఇరుకుగా ఉండటంతో సేవలు అందించే సిబ్బందికి స్థలం కేటాయించలేకపోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ప్రాంతాల్లో వీరికి స్థలం ఇచ్చే పరిస్థితి లేదు.
20- 30 మందికే..
ప్రస్తుతం ప్రజలు బ్యాంకులు, తపాలా కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. ఇక్కడ రోజుకు 20- 30 మందికి సేవలు అందిస్తున్నారు. ప్రజలు తమ పనులు మానుకొని.. వరుసల్లో నిల్చోవడంతో టోకెన్లు ఇచ్చి.. ఏ రోజు రావాలో సిబ్బంది సూచిస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో ఖాతాదారులకు మాత్రమే ఆధార్‌ సవరణలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నిర్వాహకులకు స్థలం కేటాయించి.. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
సచివాలయాల్లో అందిస్తే.. 
మరోవైపు పౌరులకు సత్వర సేవలు అందించడానికి ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఇక్కడా కూడా సేవలను అందించాలనే ప్రతిపాదన ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందుకు డిజిటల్‌ అసిస్టెంట్లకు సంబంధిత పరీక్షల్లో ప్రతిభ చూపేలా శిక్షణ ఇస్తే.. ప్రజలకు సకాలంలో సేవలు అందే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని