
డిగ్రీ కళాశాలలకు కేటగిరీల ఖరారు
‘కేటగిరి-1’లో 13కి స్థానం
మౌలిక వసతులు, నాణ్యమైన విద్య ప్రామాణికంగా గుర్తింపు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: డిగ్రీ విద్యలో నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పనే ప్రామాణికంగా ముందుకెళ్తున్న రాష్ట్రంలోని కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వంలోని ‘ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్’ మొదటి మూడు కేటగిరీలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జిల్లాకు చెందిన పదమూడు డిగ్రీ కళాశాలలు ‘కేటగిరి-1’లో స్థానం పొందాయి. కేటగిరి-1లో స్థానం పొందిన వాటిల్లో సీఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(పీలేరు), ఎమరాల్డ్స్ (తిరుపతి), గేట్ (తిరుపతి), ఇందిర రాజీవ్ మెమోరియల్ (కుప్పం), మదర్‌థెరిసా (గంగవరం), సీకాం (తిరుపతి), శేషాచల (పుత్తూరు), శ్రీజ్ఞానాంబిక (మదనపల్లె), ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల(తిరుపతి), శ్రీవిద్యానికేతన్ డిగ్రీ కళాశాల(చంద్రగిరి), విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల(చిత్తూరు), విజ్ఞానసుధ డిగ్రీ అండ్ పీజీ కళాశాల(చిత్తూరు), కుప్పం డిగ్రీ కళాశాల(కుప్పం) ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో వందకు పైగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా.. కేవలం 13 కళాశాలలకు మాత్రమే ప్రభుత్వం కేటగిరి-1లో గుర్తింపు కల్పించింది. ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, అత్యుత్తమ ప్రమాణాలు, ఉద్యోగ కల్పన ప్రక్రియలను ప్రాధాన్యాంశాలుగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలలకు కేటగిరీలు కల్పించడం హర్షణీయమని పేర్కొన్నారు.