
రైతు చెంతకే ఎరువులు
ఆర్బీకే సేవల్లో మార్పులు
చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే
రైతు భరోసా కేంద్రాల సేవల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది పలు లోపాలు వెలుగుచూశాయి. సొమ్ము చెల్లించిన రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వలేకపోయారు. పలుచోట్ల సొమ్ము వెనక్కిచ్చి సరఫరా చేయలేమని చేతులెత్తేశారు. జిల్లాలో ఆరుచోట్ల ఏర్పాటు చేసిన ఎరువుల హబ్‌లు ఆర్బీకేలకు దూరంగా ఉండటమే కారణమని గుర్తించారు. దీంతో రబీ నుంచి సేవల్లో మార్పులు చేశారు. ఆర్బీకేల్లో ఎరువుల సరఫరా బాధ్యతను ఏపీ ఆగ్రోస్ నుంచి మార్క్‌ఫెడ్‌కు అప్పగించగా.. పురుగుమందులు, విత్తనాల సరఫరాను ఏపీ ఆగ్రోస్ వద్దే ఉంచారు.
హబ్‌ల పెంపు
ఆర్బీకేల్లో సొమ్ము చెల్లించిన రైతులకు 48 గంటల్లో ఎరువులు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దూరప్రాంత హబ్‌ల నుంచి ఎరువుల రవాణా గిట్టుబాటు కాదని గుత్తేదారులు చేతులెత్తేశారు.సొమ్ము చెల్లించిన రైతులకు నెల రోజుల తర్వాత వెనక్కి ఇచ్చారు. జిల్లాలోని 11 వ్యవసాయ డివిజన్లలో ఎరువుల హబ్‌లు ఉన్నాయి. దీంతో పాటు 520 ఆర్బీకేలకు అనుబంధంగా ఉత్పాదకాలు నిల్వ చేసే గోదాములను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అన్నిరకాల ఎరువులు, పురుగు మందులు తదితరాలను ఆర్బీకేల వద్దనే గోదాముల్లో నిల్వ చేసి రైతులకు నేరుగా విక్రయించనున్నారు.
కియోస్క్‌ల్లో నమోదుతోనే..
పాత పద్ధతిలో రైతులు తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల్లోని కియోస్కుల్లో ఆర్డర్ చేసేవారు. కొత్త విధానంలో వ్యక్తిగతంగా ఆర్డర్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. గోదాముల్లో ఎరువులు, పురుగు మందులను ఎంపిక చేసుకుని గ్రామ వ్యవసాయ సహాయకుడి వద్ద డబ్బు చెల్లించాలి. వీఏఏలు కియోస్కులో రైతు పేరు, ఆధార్, సర్వే నంబరు నమోదు చేస్తారు. ఆర్బీకేల్లో అన్ని వ్యవసాయ ఉత్పాదకాలు నిల్వ ఉండేలా చూసుకునే బాధ్యత వ్యవసాయ సహాయకుడిదే. కేవలం డిజిటల్ చెల్లింపులకే అనుమతించాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. దీంతో రైతుల వద్ద ఏటీఎం కార్డు లేకపోతే ఎరువులు కొనడం కష్టమే.
మార్కెట్ ధర కంటే తక్కువ..
ఆర్బీకేల్లో మార్కెట్లో కంటే తక్కువ ధరకే ఎరువులు విక్రయిస్తున్నాం. ఆర్బీకేల్లో 335 టన్నుల ఎరువుల నిల్వకు చర్యలు చేపట్టడంతో పాటు సరఫరాను వేగవంతం చేశాం. గ్రామంలోనే కోరిన ఎరువును పొందవచ్చు. - నవీన్‌కుమార్‌రెడ్డి, డీఎం, మార్క్‌ఫెడ్