
బూందీపోటు.. సాంకేతికతకు చోటు
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
థర్మోఫ్లూయిడ్ స్టౌల ఏర్పాటు
దాత సాయం
తిరుమలలోని లడ్డూప్రసాదం తయారీకేంద్రంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నివారణకు దాత ఇచ్చిన విరాళంతో శ్రీవారి ఆలయ సమీపంలో నూతన బూందీపోటు సిద్ధమవుతోంది. అత్యాధునిక థర్మోఫ్ల్లూయిడ్ స్టౌలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకు తితిదే ఇంజినీరింగ్ శాఖ చేపట్టిన ప్రాజెక్ట్ సాంకేతికతకు అద్దం పడుతోంది.
న్యూస్‌టుడే, తిరుమల
భక్తులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డూ ప్రసాదానికి ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ రోజుల్లో రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల లడ్డూలను పోటులో కార్మికులు తయారు చేస్తారు. స్థలాభావంతో తితిదే.. 2007లో బూందీపోటును ఆలయ వెలుపలకు తరలించింది. ఇక్కడ బూందీ తయారుచేసి ఆలయంలోకి తరలించి అక్కడ లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇదే సమయంలో పోటులో నెయ్యి స్టౌలను వేడిచేసే సమయంలో ఆవిర్లతో చిమ్నీలలో ఏర్పడిన తెట్టుకు మంటలు అంటుకుని తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని భారీగా నష్టం వాటిల్లేది. దీని నివారణకు తితిదే ఇంజినీరింగ్ విభాగం ఆధునిక సాంకేతిక మార్గాల పరిశీలనలో భాగంగా చెన్నైలోని అడయార్ ఆనంద్‌భవన్‌ను పరిశీలించి థర్మోఫ్ల్లూయిడ్ స్టౌలను గుర్తించారు. మొదటగా రెండు స్టౌలను తెచ్చారు. ప్రయోగాత్మకంగా పరిశీలించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
టెక్నాలజీ అద్భుతం
థర్మోఫ్లూయిడ్ స్టౌలలో ఎక్కడా అగ్నిని వినియోగించే అవకాశం లేదు. ఈ టెక్నాలజీలో ముందుగా ఒక భవనంలో థర్మోఫ్లూయిడ్ ట్యాంక్‌లను నిర్మిస్తారు. అందులో ఫ్లూయిడ్‌ను నింపుతారు. దాన్ని ఒక బాయిలర్ ద్వారా వేడిచేస్తారు. అనంతరం వేడైన ఫ్లూయిడ్‌ను ఉష్ణవాహక విధానంలో పైపుల ద్వారా థర్మోఫ్ల్లూయిడ్ స్టౌ వద్దకు పంపుతారు. అందులో నింపిన నెయ్యిని పైపు నుంచి వచ్చిన ఫ్ల్లూయిడ్ వేడిచేస్తుంది. ఈ వేడి ఫ్ల్లూయిడ్ పైపులో నిరంతరం వచ్చి వెళుతుండడంతో నెయ్యి పూర్తిస్థాయిలో కరుగుతుంది. దాంతో బూందీ తయారు చేసుకోవచ్ఛు ఇందులో మంటలకు ఆస్కారం లేకపోవడంతో అగ్నిప్రమాదాలు పూర్తిగా నిర్మూలించవచ్ఛు
థర్మోఫ్లూయిడ్ ట్యాంక్, బాయిలర్ నిర్మాణం
పూర్తికావొస్తున్న స్టౌల ఏర్పాటు
మొదటి విడతలో 40 థర్మోఫ్లూయిడ్ స్టౌలను నూతన బూందీపోటు భవనంలో నాలుగు వరుసల్లో ఏర్పాటు చేశారు. నెయ్యి తెట్టు, ఆవిర్లు అంటుకోకుండా ఎత్తైన భవనంలో అత్యాధునిక చిమ్నీలను ఏర్పాటు చేయడంతోపాటు గోడలకు స్టీలు పలకలను అమర్చారు. దీనివల్ల ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేసుకోవడం సులభంగా ఉంటుంది. దశలవారీగా మరో 20 అనంతరం మరో 20 స్టౌలను ఏర్పాటు చేసేందుకు తితిదే ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో మొదట విడత థర్మోఫ్లూయిడ్ స్టౌలు అందుబాటులోకి రానున్నాయి.
ఇండియా సిమెంట్స్ అధినేత విరాళం
తితిదే బోర్డు సభ్యుడు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ విరాళంగా ఇచ్చిన రూ.15 కోట్లతో నూతన బూందీపోటు, స్టౌలను ఏర్పాటు చేస్తున్నాం. ఫ్లూయిడ్ టెక్నాలజీ వినియోగంతో పూర్తిస్థాయిలో అగ్నిప్రమాదాలను నివారించవచ్ఛు అదే సమయంలో తయారీకి ఎటువంటి సమస్యలు ఉండవు. - ఏవీ ధర్మారెడ్డి, తితిదే అదనపు ఈవో