Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతిపాదనల్లోనే..నగర పంచాయతీ

అన్ని అర్హతలున్నా కార్యరూపం దాల్చని వైనం

పీలేరులో ఇదీ పరిస్థితి

నగర పంచాయతీగా పీలేరుకు అన్ని అర్హతలున్నా ప్రతిపాదనల్లోనే ఉండిపోయింది. రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీల్లో ముందు వరుసలో ఉంది. జనాభా, ఆదాయం ఎక్కువే. ఎనిమిదేళ్ల కిందట దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. కానీ దస్త్రం ముందుకు కదలడం లేదు. స్థాయి పెరిగితే అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులతోపాటు ఇతర వసతులు అందుబాటులోకి వస్తాయి.

- న్యూస్‌టుడే, పీలేరు

జిల్లాలో పీలేరు, రేణిగుంట, బి.కొత్తకోట పంచాయతీలను నగర పంచాయతీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని 2015లో ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఆదేశాలు వచ్చాయి. అప్పట్లో పాలకులు నగర పంచాయతీ అయితే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్న భావనతో ప్రతిపాదనలు పంపలేదు. పీలేరు పట్టణం జిల్లా నడిబొడ్డున ఉండడంతో పాటు రాయచోటి, మదనపల్లె, తిరుపతి, చిత్తూరు పట్టణాలకు 55 కిలోమీటర్ల దూరంలో ఉండి వ్యాపారం, వైద్యం, విద్యా పరంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నగర పంచాయతీగా మారిన బి.కొత్తకోట, కుప్పం(మున్సిపాలిటీ)లను పోలిస్తే అన్నింటిలోనూ ఇక్కడ అర్హతలు ఉన్నాయి. ఆర్టీసీ డిపోతో పాటు, ప్రభుత్వ పీజీ కళాశాల, వంద పడకల ఆసుపత్రి ఉన్నాయి.

1922లో గుర్తింపు

పీలేరును 1922లో పంచాయతీగా.. జనాభా ప్రతిపాదికన 1956లో మేజర్‌ పంచాయతీగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి జనాభా, ఆదాయం పెరుగుతున్నా స్థాయి పెరగడం లేదు. ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు 2012లో నగర పంచాయతీ చేయాలని ప్రతిపాదించినా పన్నుల భారం పడుతుందన్న కారణంతో స్థానిక నాయకులు పట్టించుకోలేదు. దీనికన్నా తక్కువ జనాభా ఉన్నా బి.కొత్తకోట నగర పంచాయతీ, కుప్పం మున్సిపాలిటీగా మార్పు చెందడంతో స్థానికుల్లో చర్చనీయాంశమైంది.

మరోసారి ప్రతిపాదన

రేణిగుంట, బి.కొత్తకోట, పీలేరులను నగర పంచాయతీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని 2015 జనవరి 19న అప్పటి జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌.జైన్‌ ఎంపీడీవోలకు సమాచారం పంపారు. అదీ కార్యరూపం దాల్చలేదు. నగర పంచాయతీకి ఏడాదికి రూ.40 లక్షల ఆదాయంతో పాటు జనాభా 20 వేల నుంచి 40 వేలలోపు ఉండాలి. జనాభాలో 25 శాతం వ్యవసాయేతర పనుల్లో ఉండాలి. ఈ నిబంధనలన్నీ పీలేరుకు ఉన్నా ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు.

అందరి అభిప్రాయాలు తీసుకుంటా

పీలేరును నగర పంచాయతీగా అభివృద్ధి చేసేందుకు అన్ని అర్హతలున్నాయి. పన్నులు పెరుగుతాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థాయి పెరిగితే ప్రత్యేక గ్రాంట్లు రావడంతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగుతా. - చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, పీలేరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని